మూత్రపిండాలు మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడం, ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడం, హార్మోన్లను ఉత్పత్తి చేయడం వంటి ముఖ్యమైన పనులు అవి నిర్వహిస్తాయి. మూత్రపిండాల పనితీరు తగ్గినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఇవి చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల చాలామంది గుర్తించరు. వీటిని సకాలంలో గుర్తించి, చికిత్స పొందడం వల్ల వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. ముఖ్యంగా, ఉదయం పూట కనిపించే కొన్ని సంకేతాలు కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని సూచిస్తాయి.
మూత్రపిండాల వ్యాధికి ప్రధాన లక్షణాలు:
ముఖం వాపు: ఉదయం నిద్ర లేవగానే కళ్లు, ముఖం వాపుగా అనిపించడం మూత్రపిండాల సమస్యకు ఒక ముఖ్య సంకేతం. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల ముఖం, కాలు, చేతులు వాస్తాయి.
మూత్రంలో నురుగు: మూత్రంలో నిరంతరం నురుగు కనిపించడం మూత్రపిండాల గ్లోమెరులర్ దెబ్బతిందని సూచిస్తుంది. ఇది మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తుంది.
ఎండిపోయిన చర్మం, దురద: మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే రక్తం నుంచి విష పదార్థాలు బయటకు వెళ్లవు. ఇది చర్మం పొడిబారడానికి, తీవ్రమైన దురదకు కారణమవుతుంది.
మెదడు పనితీరులో మందగింపు (బ్రెయిన్ ఫాగ్): మూత్రపిండాలు వ్యర్థాలను బయటకు పంపనప్పుడు, ఆ వ్యర్థాలు మెదడును ప్రభావితం చేస్తాయి. దీనివల్ల అలసట, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి.
నోటి నుంచి దుర్వాసన: మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు యూరియా వంటి వ్యర్థాలు పేరుకుపోతాయి. అవి నోటిలోని లాలాజలంతో కలిసి అమ్మోనియాగా మారి దుర్వాసనకు కారణమవుతాయి.
డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారికి మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే ఈ లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. వాపు, మూత్రంలో నురుగు లేదా అలసట వంటి లక్షణాలు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతాలు కావచ్చు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అనుమానం ఉంటే, వెంటనే అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.
[