Hyderabad company hired a Dog: గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ.. సంవత్సరాలకు సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికీ.. కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులను కరివేపాకుల మాదిరిగా తీసిపారేస్తున్నాయి. ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్నాయి. సంవత్సరాల నమ్మకంగా పనిచేసినప్పటికీ మరో మాటకు తావు లేకుండా నిర్ధాక్షణ్యంగా బయటికి పంపిస్తున్నాయి.. గడిచిన రెండు సంవత్సరాలుగా ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ నిరాటంకంగా కొనసాగిపోతోంది. ఇది ఎక్కడదాకా వెళ్తుంది? ఎంత దాకా దారి తీస్తుంది? అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.. ఇలాంటి సమయంలో గొప్ప గొప్ప విద్యావంతులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఓ కుక్క కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సాధించింది.
హైదరాబాద్ బాటలో..
హైదరాబాదులో ఇటీవల ఓ కార్పొరేట్ కంపెనీ చీప్ హ్యాపీనెస్ ఆఫీసర్ గా ఓ కుక్కను నియమించుకుంది. ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి కార్పొరేట్ కంపెనీలలో హ్యాపీనెస్ అనే విభాగం ఉండదు. కాకపోతే ఆ కుక్క కోసం క్రియేట్ చేశారు. దానికోసం ఒక క్యాబిన్.. లాప్టాప్.. కష్టమేజ్డ్ చైర్.. ఇతర సదుపాయాలు కల్పించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కార్పొరేట్ కంపెనీ తీసుకున్న నిర్ణయం సంచలనం అనుకుంటే.. ఇప్పుడు గురు గ్రామ్ కంపెనీ తీసుకున్న నిర్ణయం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గురు గ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లిప్ ఫ్రాగ్ అనే కంపెనీ ఆనందాన్ని కలిగించే ముఖ్య అధికారిగా గోల్డెన్ రిట్రీవర్ అనే కుక్కను నియమించుకుంది. విధి నిర్వహణలో ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా ఉండేలా.. తన క్యూట్ హావభావాలతో ఆనందానికి గురి చేయడమే దీని పని. ఉద్యోగులకు మానసిక ప్రశాంతతను అందిస్తూ.. పరధ్యానం వైపు వెళ్లకుండా ఉండేందుకు ఇది ప్రయత్నిస్తుందని లీప్ ఫ్రాగ్ సంస్థ లింక్డ్ ఇన్ లో రాస్కొచ్చింది.
ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు..
కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగులకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. దాని నుంచి వారిని వారు కాపాడుకోవడానికి మానసిక ప్రశాంతత అవసరం. అయితే అటువంటి వారికి తక్కువ ఖర్చుతో ఒత్తిడి దూరం చేయడానికి కార్పొరేట్ కంపెనీలు కుక్కలను ఎంచుకున్నాయి. ఇందులో భాగంగానే చీప్ హ్యాపీనెస్ ఆఫీసర్ అనే పోస్ట్ ను క్రియేట్ చేశాయి. ఆ పోస్టుల్లో కుక్కలను నియమిస్తున్నాయి. చూడ్డానికి అందంగా.. ముద్దుగా ఉండే కుక్కలను నియమించుకుంటున్నాయి. తద్వారా ఉద్యోగులు ఆ కుక్కలను చూస్తూ ఒత్తిడి మర్చిపోతారని కంపెనీలు భావిస్తున్నాయి.. అయితే ఈ ఆలోచనను మిగతా కార్పొరేట్ కంపెనీలు కూడా అమలు చేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.