Heavy Rains alert to AP: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో సోమవారం అర్ధరాత్రి తర్వాత అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం అది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఈరోజుకు అది వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న రెండు రోజుల్లో మరింత బలపడుతుందని భావిస్తోంది. దీని ప్రభావంతో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో సైతం తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది.
ఉత్తరాంధ్ర పై ప్రభావం..
వాయుగుండం గా మారే క్రమంలో ఉత్తరాంధ్ర పై ( North Andhra )తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ,ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ కనిపిస్తోంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో అనకాపల్లి జిల్లా సలపువానిపాలెంలో 60 మిల్లీమీటర్లు, శ్రీకాకుళంలో 58 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 ప్రాంతాల్లో 40 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం విశేషం.
ప్రభుత్వం అప్రమత్తం..
మరోవైపు ఏపీకి భారీ వర్షం సూచన హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్( toll free number) 112, 1070, 18004250101 లను అందుబాటులోకి తెచ్చింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ దళాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రధానంగా ఈ వాయుగుండం ప్రభావం శ్రీకాకుళం జిల్లా పై ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. ఒక్క జిల్లా కేంద్రంలోని 52.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం.