మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్ అయితే మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. అక్టోబర్ 1 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ప్రత్యేక ‘ఇంపీరియా ప్రోగ్రామ్’ కోసం కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ఈ మార్పుల తర్వాత ఇంపీరియా కస్టమర్‌గా కొనసాగడానికి లేదా కొత్తగా చేరడానికి ఉన్న నిబంధనలు మరింత కఠినంగా మారనున్నాయి. జూన్ 30 లేదా అంతకు ముందు ఇంపీరియా ప్రోగ్రామ్‌లో భాగమైన కస్టమర్లకు కూడా ఈ కొత్త నియమాలు వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
కొత్త నిబంధనలివే
కొత్త నిబంధనల ప్రకారం.. ఇంపీరియాలో చేరడానికి లేదా కొనసాగడానికి టోటల్ రిలేషన్ షిప్ విలువను ప్రమాణాన్ని బ్యాంక్ పెంచింది. ఇప్పుడు ఇంపీరియా కస్టమర్‌గా మారాలంటే.. మీరు, మీ కుటుంబ సభ్యుల ఖాతాలలో కనీసం రూ. 1 కోటి TRV ఉండాలి. జూలై 1, 2025 తర్వాత ఇంపీరియా స్టేటస్ పొందిన వారికి లేదా స్టేటస్ అప్‌గ్రేడ్ లేదా డౌన్‌గ్రేడ్ అయిన వారికి ఈ కొత్త నిబంధనలు ఇప్పటికే వర్తిస్తున్నాయి. అక్టోబర్ 1 నుండి పాత కస్టమర్లందరికీ ఇది అమలులోకి వస్తుంది.
TRV అంటే ఏమిటి?: TRV అనేది ఒక కస్టమర్‌కు బ్యాంకుతో ఉన్న మొత్తం ఆర్థిక సంబంధాన్ని సూచిస్తుంది. ఇందులో సేవింగ్స్ ఖాతాతో పాటు ఇతర పెట్టుబడులు, రుణాలు వంటివి కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కొత్త TRV నిబంధనలతో పాటు పాత నిబంధనలు కూడా కస్టమర్లకు వర్తిస్తాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. అంటే మీరు ఒకవేళ రూ.1 కోటి TRV ప్రమాణాన్ని చేరుకోకపోయినా.. ఈ క్రింది షరతులలో ఏదైనా ఒకటి నెరవేరిస్తే మీరు ఇంపీరియాలో కొనసాగవచ్చు:
- మీ కరెంట్ ఖాతాలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్ రూ.15 లక్షలు ఉండాలి.
- మీ సేవింగ్స్ ఖాతాలో నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ. 10 లక్షలు ఉండాలి.
- సేవింగ్స్, కరెంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు కలిపి నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ. 30 లక్షలు ఉండాలి.మీకు హెడీఎఫ్సీ
- బ్యాంక్‌లో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉండి, ప్రతి నెలా మీకు రూ. 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జీతం వస్తూ ఉండాలి.
ఇంపీరియా కస్టమర్లకు లభించే ప్రయోజనాలు
ఇంపీరియా ప్రోగ్రామ్‌లో భాగమైన కస్టమర్లకు బ్యాంక్ ఎటువంటి ఛార్జీ లేకుండా అనేక ప్రీమియం సేవలను అందిస్తుంది. వీటిలో బ్రాంచ్‌ల నుండి డబ్బు బదిలీ చేయడం, చెక్ స్టాప్ పేమెంట్ సూచనలు, డూప్లికేట్ స్టేట్మెంట్ లేదా పాత రికార్డు ఆర్డర్ చేయడం, వడ్డీ లేదా బ్యాలెన్స్ సర్టిఫికేట్లు పొందడం, సంతకం, చిరునామా ధృవీకరణ వంటివి ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..