ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన 8 కోట్ల మందికి పైగా సభ్యుల కోసం సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తోంది. దీని పేరు EPFO 3.0. ఈ కొత్త వ్యవస్థతో పీఎఫ్ సంబంధిత సేవలు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయి. మొదట జూన్‌లో ప్రారంభం కావాల్సిన ఈ ప్లాట్‌ఫామ్ సాంకేతిక కారణాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. అయితే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి పెద్ద ఐటీ కంపెనీలు ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. త్వరలోనే ఈ ప్లాట్‌ఫామ్ సభ్యులందరికీ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఆధునిక వ్యవస్థ పీఎఫ్ సేవలను భవిష్యత్తులో మరింత సరళంగా, నమ్మదగినదిగా మారుస్తుంది.
ఏటీఎం – యూపీఐతో పీఎఫ్ విత్‌డ్రా
EPFO 3.0 లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లలో ఒకటి ఏటీఎం నుండి నేరుగా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం. దీని కోసం మీ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసుకోవాలి. దీనివల్ల మీరు కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పీఎఫ్ ఖాతా నుండి డబ్బు తీసుకోవచ్చు. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో త్వరగా డబ్బు అవసరమైనప్పుడు.. మీరు యూపీఐ ద్వారా కూడా మీ పీఎఫ్ ఖాతా నుండి నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఈ ఫీచర్ త్వరగా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
ఈజీగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్
కొత్త EPFO 3.0 ప్లాట్‌ఫామ్‌లో క్లెయిమ్, వ్యక్తిగత వివరాల దిద్దుబాటు ప్రక్రియలు కూడా పూర్తిగా డిజిటల్ చేయబడ్డాయి. ఇకపై ఉద్యోగులు తమ మొబైల్‌లో ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా పేరు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను సులభంగా అప్‌డేట్ చేయవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా, పత్రాలు సమర్పించాల్సిన ఇబ్బంది కూడా తగ్గుతుంది. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. పీఎఫ్ సభ్యుడు మరణించినప్పుడు వారి మైనర్ పిల్లలు క్లెయిమ్ చేసుకుంటే, ఇకపై వారికి సంరక్షక ధృవీకరణ పత్రం అవసరం లేదు. ఈ మార్పు వల్ల కుటుంబాలకు త్వరగా ఆర్థిక సహాయం అందుతుంది.
డిజిటల్ డాష్‌బోర్డ్‌తో పూర్తి పారదర్శకత
EPFO 3.0 కొత్తగా రూపొందించిన డిజిటల్ డాష్‌బోర్డ్‌ను తీసుకువస్తుంది. దీని ద్వారా సభ్యులు తమ నెలవారీ డిపాజిట్ మొత్తం, క్లెయిమ్ స్టేటస్, మొత్తం ఖాతా సమాచారాన్ని ఒకే చోట చూడగలుగుతారు. ఇది పారదర్శకత మరియు ఉద్యోగుల స్వావలంబన వైపు ఒక పెద్ద ముందడుగు.
ఈ మార్పులతో పాటు ఇప్పటికే కేవైసీ వెరిఫికేషన్, వ్యక్తిగత వివరాల ఆన్‌లైన్ దిద్దుబాటు, ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ బదిలీ ప్రక్రియలు చాలా వేగంగా మారాయి. ఈ సంస్కరణలన్నీ ఈపీఎఫ్‌వో డిజిటల్ విప్లవంలో భాగం. ఈ కొత్త వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇది ఉద్యోగులకు ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..