Commonwealth Games : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో భారత్‌కు ఒక శుభవార్త అందింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం భారత్ అధికారికంగా బిడ్ దాఖలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రీడల ఆతిథ్య నగరంగా అహ్మదాబాద్ పేరును ప్రతిపాదించారు. ఈ విషయాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. హోస్ట్ కొలాబరేషన్ అగ్రిమెంట్ (HCA)తో పాటు, వివిధ మంత్రిత్వ శాఖల, అథారిటీల నుంచి హామీ పత్రాలపై సంతకాలు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకవేళ భారత్ బిడ్ ఆమోదం పొందితే, గుజరాత్ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది.
ఆతిథ్యానికి అహ్మదాబాద్ ఎందుకు?
అహ్మదాబాద్ నగరంలోని క్రీడా మౌలిక సదుపాయాలను ఈ ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. “అహ్మదాబాద్ అంతర్జాతీయ స్థాయి స్టేడియాలు, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలు, క్రీడా సంస్కృతితో ఆదర్శవంతమైన ఆతిథ్య నగరంగా ఉంది” అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం ఇప్పటికే 2023 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌ను విజయవంతంగా నిర్వహించి తన సామర్థ్యాన్ని చాటుకుంది.
ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వగలిగితే, 72 దేశాల నుంచి క్రీడాకారులు ఇక్కడకు వస్తారు. క్రీడాకారులు, కోచ్‌లతో పాటు వేలాది మంది పర్యాటకులు, మీడియా సిబ్బంది మరియు నిపుణులు కూడా ఈ ఈవెంట్‌కు వస్తారని అధికారులు తెలిపారు. దీనివల్ల స్థానిక వ్యాపారాలకు, పర్యాటక రంగానికి, ఆదాయానికి భారీ ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు చెప్పారు.
ఈ మెగా ఈవెంట్ క్రీడా రంగానికే కాకుండా, క్రీడా శాస్త్రం, ఈవెంట్ నిర్వహణ, లాజిస్టిక్స్, బ్రాడ్‌కాస్టింగ్, మీడియా, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్స్ వంటి అనేక రంగాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. “అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల దేశంలో జాతీయ గౌరవం, ఐక్యత పెరుగుతుంది. ఇది ఒక గొప్ప జాతీయ అనుభవాన్ని అందిస్తుంది. కొత్త తరం క్రీడాకారులకు ఇది ఒక కెరీర్ ఆప్షన్‌గా ప్రోత్సహిస్తుంది” అని ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఈ మెగా ఈవెంట్ ఉద్యోగ అవకాశాలను సృష్టించి, పర్యాటకాన్ని పెంచుతుందని, పెద్ద ఎత్తున జరిగే క్రీడా ఈవెంట్‌లకు సంబంధించిన రంగాలలో నిపుణుల వృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.