Chandrababu Resignation Viral News: సోషల్ మీడియా( social media) రాజ్యమేలుతున్న రోజులు ఇవి. రాజకీయంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. ప్రత్యర్థులపై వ్యతిరేక ప్రచారం చేయడం మరో ఎత్తు. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా అనేది దుష్ప్రచారానికి ఎక్కువగా వినియోగిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా చేస్తారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అది మన రాష్ట్రంలో కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో తెగ ప్రచారం నడుస్తోంది. దీంతో వారంతా నిజమేనా అని ఆరా తీసేదాకా పరిస్థితి వచ్చింది. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. గత రెండు రోజులుగా చంద్రబాబు రాజీనామా, ఎన్డీఏ పై అవిశ్వాసం పేరుతో ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే అది ఉత్తరాది సోషల్ మీడియాలోనే కావడం గమనార్హం. ఈ తరుణంలో టిడిపి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో క్లారిటీ ఇచ్చింది.
బీహార్ ఎన్నికల నేపథ్యంలో..
బీహార్( Bihar) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ జేడీయు ఎన్డీఏలో కీలక భాగస్వామి. తెలుగుదేశం పార్టీతో పాటు జేడీయు అండగా నిలబడడంతోనే ఎన్డీఏ 3.0 అధికారంలోకి రాగలిగింది. అయితే దేశ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు, బీహార్ లో ఎన్డీఏను అస్థిరపరిచేందుకు కొన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షం తెలుగుదేశం పార్టీ లో అంతర్గత విభేదాలు వచ్చాయని.. చంద్రబాబు రాజీనామా చేయబోతున్నారని.. నారా లోకేష్ తమ 16 మంది ఎంపీలతో ఎన్ డి ఏ పై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రచారం ఎవరు చేశారో తెలియడం లేదు కానీ.. వారి అంతిమ లక్ష్యం బిజెపి అన్నది మాత్రం తెలుస్తోంది.
టిడిపి స్పందన..
ఉత్తరాది రాష్ట్రాల్లో తెగ ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) స్పందించింది.’ ఉత్తరాది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ ప్రచారం అది. ఏపీ సీఎం చంద్రబాబు గారు రాజీనామాకు సిద్ధమయ్యారని.. ఆయన కుమారుడు లోకేష్ తమ రాష్ట్రానికి చెందిన 16 మంది ఎంపీలతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారని ఈ ప్రచార సారాంశం. ఇది పూర్తిగా అవాస్తవం’ అని టిడిపి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పూర్తి స్పష్టతనిచ్చింది. దీంతో ఇది జాతీయ స్థాయిలో ఒక చర్చగా మారింది. అయితే ఈ ప్రచారం వెనుక ఎవరు ఉన్నారు అన్నదానిపై తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
టిడిపి పై టార్గెట్..
ఏపీలో( Andhra Pradesh) తెలుగుదేశం, జనసేన, బిజెపి లతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చింది. 164 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలతో తిరుగులేని విజయం సాధించింది కూటమి. మరోవైపు తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ స్థానాలు సాధించి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా మారింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టిడిపి కీలక భాగస్వామిగా ఉండడంతోనే కొందరు ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ కోరడం విశేషం.