ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పౌరులకు సమర్థవంతమైన, పారదర్శకమైన పౌర సరఫరాల వ్యవస్థను అందించే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించింది. ఆగస్టు 25న విజయవాడలో ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్డులను లబ్ధిదారులకు అందజేయడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో తొమ్మిది జిల్లాల నుండి లబ్ధిదారులకు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించబడ్డాయి. మొత్తం 6,71,000 కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. ప్రతి కార్డులోనూ QR కోడ్ ఉంటుంది. లబ్ధిదారులు రేషన్ సరుకులను తీసుకున్నప్పుడు ఈ QR కోడ్ స్కాన్ చేయబడుతుంది.
దీని ద్వారా, కేంద్ర జిల్లా కార్యాలయాలకు వెంటనే సమాచారం అందుతుంది. దీనివల్ల రేషన్ పంపిణీలో ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ప్రభుత్వం సెప్టెంబర్ 15 లోపు 1.46 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా చిరునామా మార్చుకున్న వారికి కూడా ఈ కార్డులు అందుబాటులో ఉంటాయి. ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే విధానం చాలా సులభతరం చేయబడింది. ఆన్లైన్లో మీసేవ లేదా ఈపీసేవ పోర్టల్ ద్వారా, ఆఫ్లైన్లో, వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు 9552300009 అనే నంబరును తమ మొబైల్లో సేవ్ చేసుకొని, హాయ్ అని మెసేజ్ పంపించాలి. అప్పుడు అందుబాటులో ఉన్న సేవల జాబితా వస్తుంది. అందులో రేషన్ కార్డుకు సంబంధించిన సేవలను ఎంచుకుని, సూచనల ప్రకారం అవసరమైన వివరాలు మరియు పత్రాలను సమర్పించాలి.