Allegations on YS Jagan: ఏదైనా ఒక రాజకీయ పార్టీకి పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారమే పార్టీ నేతలు మాట్లాడాలి. కానీ వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పార్టీ ఒక రాజకీయ చదరంగం. ఎందుకంటే ఆ పార్టీలో ఎప్పుడు ఎవరి పాత్ర వస్తుందో చెప్పలేం. ఆ పార్టీ ఆవిర్భావ సమయంలో ఎంతోమంది నేతలు పనిచేశారు. కానీ కొన్నేళ్ల పాటే వారి ప్రయాణం సాగింది. 2019 ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల పాత్ర కీలకం. అటువంటి నేతను అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టారు జగన్. ఆయన ఒక్కరే కాదు. నేతలతో పాటు అధికారులు అందరూ ఆయన బాధితులే. అలాగని అందలం ఎక్కించుకున్న నేతలు కూడా ఉన్నారు. అధికారులు సైతం ఉన్నారు. అలా తనకోసం జైలుకు వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని అయితే ఏకంగా తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొచ్చారు. మంచి పదవులు ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే అధికారిణి పై జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి మరకలు అంటించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారిగా..
తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీ లక్ష్మీ( senior IAS Office Sri Lakshmi ) గురించి తెలియని వారు ఉండరు. జగన్ అక్రమాస్తుల కేసులో, ఓబులాపురం మైనింగ్ కేసులో దోషిగా కొన్నాళ్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి తరలివచ్చారు. తనకోసం జైలుకు వెళ్లి వచ్చిన శ్రీ లక్ష్మీ త్యాగానికి గుర్తింపుగా.. జగన్ ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొచ్చారు. అయితేనాడు వైసిపి తీసుకొచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి పై నేడు అదే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణల చేయడం ఆందోళన కలిగిస్తోంది.
టిడిఆర్ బాండ్ల విషయంలో..
తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి( Karunakar Reddy ) ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తిరుపతిలో రోడ్లు వేశారు. అలా స్థలాలు కోల్పోయిన వారికి టిడిఆర్ బాండ్లు ఇచ్చారు. అయితే ఆ బాండ్ల విషయంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పై అనేక రకాల అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే నాటి అవినీతికి తాను కారణం కాదని.. మహిళ ఐఏఎస్ అధికారి కారణమంటూ నింద మొత్తాన్ని శ్రీ లక్ష్మీ మీద నెట్టి.. కరుణాకర్ రెడ్డి తనపై వచ్చిన అవినీతి మరకలను తుడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా అప్పటి మంత్రులను ఆమె పూచిక పుల్ల మాదిరిగా చూసారని కూడా చెబుతున్నారు. అయితే జగన్ ఏరి కోరి తెచ్చుకున్న మహిళ ఐఏఎస్ పై ఆయన సన్నిహితుడిగా చెప్పబడే కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తుంటే.. దీనికి జగన్ మద్దతు ఉన్నట్టా? లేనట్టా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సహజంగానే ఇది శ్రీ లక్ష్మీలో బాధకు కారణం అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డిని నమ్మి కోర్టుల చుట్టూ తిరిగారు శ్రీలక్ష్మి. వైసిపి హయాంలో అడ్డగోలుగా వ్యవహరించి.. ఇప్పుడు ఏ పోస్టు లేకుండా ఉన్నారు. వాస్తవానికి ఆమె సీనియారిటీ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావాలి. కానీ అవినీతి నేతలతో చేతులు కలిపి జైలు పాలయ్యారు. కెరీర్ కు మాయని మచ్చ తెచ్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ ఆడిన చదరంగంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. అయితే ఆమెకు వకాల్తాగా జగన్ వస్తారా? రారా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో.. జగన్ తెచ్చుకున్న అధికారిణి పై.. జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు ఆరోపణలు చేశారంటే.. అది ముమ్మాటికి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి తగులుతుంది. ఈ చిన్న లాజిక్ తెలుసుకోకుండా కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడం సైతం కొత్త చర్చకు దారితీస్తోంది.