
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా సందుకు ఒక గణనాథుడి విగ్రహాన్ని పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. కానీ ఓ గ్రామం వినాయక చవితి పండుగకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. పూర్వీకుల నుంచి ఆ గ్రామంలో అసలు వినాయకుడి పండుగ జరుపుకోలేదట. ఈ గ్రామంలో ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం విశేషం.
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బసంపల్లి గ్రామంలో కొన్ని దశాబ్దాలుగా వినాయక చవితి పండుగను జరుపుకోవడం లేదు. తాత, ముత్తాతల నుంచి బసంపల్లిలో వినాయక చవితి పండుగకు గ్రామస్తులు దూరంగా ఉంటున్నారు. గ్రామస్తులందరూ వినాయక చవితి పండుగలు జరుపుకోకపోవడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణమాసం చివరి వారంలో గ్రామ దేవత అయిన మారెమ్మ జాతరను గ్రామస్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే మారెమ్మ జాతరకు… వినాయక చవితి పండుగ జరుపుకోకపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా…?
మారెమ్మ జాతరకు ఐదు రోజుల ముందు గాని.. ఐదు రోజుల తర్వాత గాని ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ వస్తుంది. గ్రామ దేవత మారెమ్మ జాతర సందర్భంగా గ్రామస్తులు కోళ్లు, మేకలు బలి ఇచ్చి, బంధుమిత్రులను పిలిచి భోజనాలు పెట్టుకుంటారు. అలా గ్రామంలో కోళ్లు, మేకలు బలి ఇస్తున్న సమయంలో వినాయక చవితి పండుగ ఎలా జరుపుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. వినాయక చవితి పవిత్రత దెబ్బతింటుందంటున్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా కొలుస్తున్న గ్రామ దేవత మారెమ్మ జాతరను చేయకుండా ఉండలేమని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే తమ పూర్వీకులు వినాయక చవితి పండుగను జరుపుకోకూడదని నిర్ణయించినట్లు, మారెమ్మ జాతరనే జరుపుకుంటామని గ్రామస్తులు అంటున్నారు.
ఈ సంవత్సరం కూడా ఆగస్టు 26వ తేదీన మారెమ్మ జాతర నిర్వహించటంతో ఆగస్టు 27వ తేదీన వచ్చిన వినాయక చవితి పండుగను గ్రామస్తులు జరుపుకోవడం లేదని తెలిపారు. అలాగే మారెమ్మ జాతర రోజు బసంపల్లి గ్రామస్తులు వేరే ఏ గ్రామానికి వెళ్లినా అరిష్టమని, అనారోగ్య సమస్యలు వస్తాయని గ్రామస్తుల నమ్మకం. దీంతో గడిచిన కొన్ని దశాబ్దాలుగా బసంపల్లి గ్రామస్తులు గ్రామ దేవత అయిన మారెమ్మ జాతరను జరుపుకుంటున్నారు కానీ, వినాయక చవితి పండుగను మాత్రం జరుపుకోవడం లేదు. అలా బసంపల్లి గ్రామం వినాయక చవితి పండుగకు దూరంగా ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..