జమ్మూ కశ్మీర్‌లోని కత్రా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రముఖ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో కనీసం 30 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. అర్థ్‌కువారీ ప్రాంతంలో ఇంద్రప్రస్థ భోజనాలయపై బండరాళ్లు పడడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని రియాసి ఎస్పీ పరంవీర్ సింగ్ ధృవీకరించారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ‘‘చాలా విషాదకరం’’ అని అభివర్ణించిన ఆయన.. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యల కోసం కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సంఘటనా స్థలానికి తరలించినట్లు అమిత్ షా తెలిపారు. ‘‘గాయపడిన వారికి సహాయం చేయడానికి స్థానిక యంత్రాంగం, సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడికి చేరుకుంటోంది’’ అని ఆయన తెలిపారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 6వ బెటాలియన్‌కు చెందిన సైనికులు తక్షణమే స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కత్రాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి తరలించారు. ఈ బృందం కొండచరియల్లో చిక్కుకున్న యాత్రికులకు సహాయం చేయడంతో పాటు అవసరమైన వైద్య, రవాణా సహాయాన్ని అందిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..