రెచ్చిపోయిన దొంగల ముఠా.. అర్ధరాత్రి రైళ్ళలో వరుస చోరీలు! ఆ రూట్లే వారి టార్గెట్.. – Telugu News | A series of train robberies at midnight between railway stations of Piduguralla and Nadikudi

గుంటూరు, ఆగస్ట్‌ 27: పిడుగురాళ్ల నుండి నడికుడి రైల్వే స్టేషన్ల మధ్యలో వరుసగా జరుగుతున్న చోరీలు ఆందోళన కల్గిస్తున్నాయి. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టిన రైళ్ళలో చోరీలు ఆగడం లేదు. రెండు నెలల క్రితం రైలు దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన రెండు నెలలకే మరోసారి వరుసగా రైళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. మొన్న నాగర్ సోల్ నుండి నర్సాపూర్ వెలుతున్న ఎక్స్ ప్రెస్ లోనూ నిన్న హైదరాబాద్ నుండి నర్సాపూర్ వెలుతున్న ట్రెయిన్ లోనూ దొంగలు చోరికి పాల్పడ్డారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేస్తున్నారు. ట్రెయిన్ నిలిచిపోగానే రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కి చెయిన్ స్నాచింగ్ చేసుకొని పోలీసులు అప్రమత్తమయ్యేలోపే పారిపోతున్నారు. నిన్న నడికుడి జంక్షన్ దాటిన తర్వాత ట్యాంపరింగ్ కు పాల్పడితే రెండు నెలల క్రితం న్యూపిడుగురాళ్ళ స్టేషన్ వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్ చేశారు. దీంతో‌ ప్రధానంగా ఈ మార్గం పైనే దొంగలు దృష్టి పెట్టడంపై పోలీసులు నాలుగైదు కారణాలను గుర్తించారు.

  • అద్దంకి—నార్కెట్ పల్లి హైవేకు దగ్గరలో పిడుగురాళ్ల—నడికుడి రైల్వే ట్రాక్ ఉంది. చోరి చేసిన వెంటనే హైవే పై పారిపోవడం సులభంగా ఉండటంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
  • గుంటూరు—బీబీ నగర్ మధ్య సింగిల్ ట్రాక్ మాత్రమే ఉంది. దీంతో సిగ్నల్ ట్యాంపరింగ్ చేయడం… చోరికి పాల్పడుతున్నారు.
  • రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం… గుంటూరు, నల్గొండలో మాత్రమే రైల్వే పోలీసులు ఉంటారు. అక్కడ నుండి ఈ స్టేషన్స్ వంద కిలో మీటర్ల దూరంలో ఉండటంతో దొంగలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
  • హైదరాబాద్, చెన్నై నుండి సాయంత్రం వేళల్లో బయలు దేరే ట్రయిన్స్ అర్థరాత్రి తర్వాతే ఈ మార్గాన్ని దాటుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ళను టార్గెట్ చేశారు.
  • మహారాష్ట్ర, బీహార్ కు చెందిన ముఠాలు చోరికి పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా రైల్వే పోలీసులు గుర్తించారు.

గతంలో కేవలం వేసవి సమయంలో మాత్రమే దొంగలు రైళ్ళలో చోరికి పాల్పడేవారు. ఈ ఏడాది సమ్మర్ లో రైళ్ళలో సెక్యూరిటీని పెంచి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో దొంగలు తమ పంథాను మార్చుకున్నారు. జూన్, ఆగష్టు నెలలను టార్గెట్ పెట్టుకొని చోరీలకు పాల్పడ్డారు. ప్రత్యేక దృష్టి సారించి చోరీలను అరికట్టాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment