
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. మంగళవారం దేశ రాజధానిలో 10 గ్రాముల పసిడి రూ. 600 పెరిగి రూ. 1,00,770కి చేరుకున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, భారత కరెన్సీ రూపాయి విలువ బలహీనపడటం, అంతర్జాతీయ వాణిజ్య, భౌగోళిక పరిణామాలు ఇందుకు దోహదపడుతున్నాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి రూ. లక్ష దాటగా, 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ. 550 పెరిగి రూ. 1,02,130 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్లు పది గ్రాములు రూ. 500 పెరిగి రూ. 93,550కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా రూ. 3,000 పెరగడంతో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 1,18,000(అన్ని పన్నులు కలిపి) చేరుకుందని సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడ్ గవర్నర్ లీసా కుక్‌ను తొలగించాలని తీసుకున్న నిర్ణయంతో సెంట్రల్ బ్యాంకు స్వతంత్రతపై ఆందోళనలు రేకెత్తాయి. దీంతో ఇన్వెస్టర్లు సాంప్రదాయ సురక్షితమైన ఆస్తి బంగారం వైపునకు మొగ్గు చూపారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమొడిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం 3,378.37 డాలర్లకు చేరింది. ఇక, దేశీయంగా భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ ప్రకటించిన అదనపు 25 శాతం సుంకం బుధవారం అమలు కానుండటంతో రూపాయి మారకం 12 పైసలు క్షీణించి రూ. 87.68 వద్ద నిలిచింది.