ఏపీ ప్రభుత్వం( AP government) గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక చవితిని పురస్కరించుకొని కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా గణేష్ నవరాత్రులు అంటే యువత వేడుకగా జరుపుకుంటారు. వేదికతో పాటు ప్రాంగణాలను విద్యుత్ దీపాలంకరణలో ఉంచుతారు. వాడ వాడలా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వినాయక చవితికి మాత్రమే కాదు.. విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ఉచితంగా కరెంటు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నారా లోకేష్ ట్వీట్ చేశారు.
నారా లోకేష్ ట్వీట్
రేపు వినాయక చవితి( Vinayaka Chavithi ) సందర్భంగా మండపాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు యువత. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఉచిత విద్యుత్ ప్రకటన చేశారు.’ వినాయక చవితి సందర్భంగా ఉత్సవ సమితులు, మండపాల నిర్వాహకులకు శుభవార్త. వినాయక ఉత్సవాలు జరిగే రోజుల్లో మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నా దృష్టికి మీరు తీసుకువచ్చిన వినతిని సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారితో చర్చించాను. వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం. ఈ బారక్కు ఉత్తర్వులు విడుదల చేయనుంది. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు, దుర్గా పందిళ్లకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తాం. వినాయక చవితి, దసరా ఉత్సవాలకు సంబంధించి ఉచిత విద్యుత్ కోసం రూ.25 కోట్లును కూటమి ప్రభుత్వం వెచ్చించనుంది’ అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Also Read: మద్యం కుంభకోణంలో ముడుపులు చేరవేసింది ఆయనే!
అనుమతి తప్పనిసరి..
అయితే గత అనుభవాల దృష్ట్యా వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి చేసింది ఏపీ ప్రభుత్వం. పోలీస్ శాఖ( police department) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో ఉచితంగా అనుమతులు ఇస్తున్నారు. https://ganeshutsav.net అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అన్ని శాఖల అధికారులు పరిశీలించి మండపానికి క్యూఆర్ కోడ్ జారీ చేస్తారు. https://ganeshutsav.net/ application status లోకి వెళ్లి ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిని లామినేషన్ చేయించి గణేశుని మండపంలో ఉంచాలి. తనిఖీకి వచ్చే అధికారులు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు తెలుస్తాయి.