
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ హడావుడి మొదలైంది. ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే డిమాండ్‌కు తగినట్టు ఆఫర్లు, రాయితీలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే బడా ఈ-కామర్స్ సంస్థలు పండుగ సీజన్ గిరాకీని భర్తీ చేసేందుకు సీజనల్ ఉద్యోగాల నియామకాలను కూడా ప్రారంభించాయి. ఇప్పటికే దిగ్గజ అమెజాన్ ఇండియా లక్షలాది మందిని తీసుకోవడం ప్రారంభించామని ప్రకటించగా, తాజాగా ఫ్లిప్‌కార్ట్ సైతం ఈసారి 2.2 లక్షల మందిని తీసుకుంటామని చెబుతోంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పండుగ సీజన్‌లో వినియోగదారులకు సులభంగా, సౌకర్యవంతమైన డెలివరీ సేవలందించేందుకు, సరఫరా, లాజిస్టిక్స్, డెలివరీ విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా, దీనికి అదనంగా ఫ్లిప్‌కార్ట్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్ విభాగంలో టైర్-2, టైర్-3 నగరాల్లో 650 కొత్త డెలివరీ హబ్‌లను ఏర్పాటు చేస్తామని, ఇది కేవలం పండుగ సీజన్ కోసం మాత్రమేనని తెలిపింది. ఈ పండుగ సీజన్ కోసం 28 రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, టెక్ విస్తరణ పనులను చేపట్టాం. ఈ ఏడాది సీజనల్ ఉద్యోగాల్లో వేర్‌హౌసింగ్, డెలివరీ, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ విభాగాల్లో పికర్స్, ప్యాకర్స్, సార్టర్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా తీసుకుంటాం. ప్రధానంగా ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా సరఫరాను మరింత వేగవంతంగా నిర్వహిస్తాం. ముఖ్యంగా ఈ ఏడాది పండుగ సీజన్ నియామకాల్లో గతంలో కంటే 10 శాతం ఎక్కువ మహిళా ఉద్యోగులు, దివ్యాంగులను తీసుకుంటున్నామని కంపెనీ పేర్కొంది.