Android: త్వరలో ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్, మ్యాక్‌లకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం

Android: త్వరలో ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్, మ్యాక్‌లకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం

దిశ, బిజినెస్ బ్యూరో: ఆండ్రాయిడ్ పరికరాల్లో ఫోటోలు, ఏవైనా ఫైల్స్ షేర్ చేసుకునేందుకు గూగుల్‌కు చెందిన క్విక్ షేర్ ఎప్పటినుంచో ముఖ్యమైన సాధనంగా పనిచేస్తోంది. అయితే, యాపిల్‌కు చెందిన ఐఫోన్, మ్యాక్‌లతో ఫైల్స్ షేర్ చేసుకోవడంలో మాత్రం ఎప్పుడూ ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు మారే క్రమంలో కస్టమర్లకు తమ పాత ఫోన్ నుంచి ఫైల్స్, ఫోటోలు, ఇతర విలువైన సమాచారం షేర్ చేసుకునేందుకు ప్రతిసారీ థర్డ్‌పార్టీ యాప్‌లప ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని పరిష్కరించే దిశగా గూగుల్ పనిచేస్తోందని అండ్రాయిడ్ అథారిటీ నివేదిక వెల్లడించింది. ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్‌లకు ఫైల్స్ షేర్ చేసుకునేందుకు వీలుగా ఫైల్ షేరింగ్ సిస్టమ్‌ను తీసుకురానుంది. దీనికోసం శాంసంగ్‌తో కలిసి పనిచేస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ ప్లే సర్వీసెస్‌లో క్విక్ షేర్ కొత్త అప్‌డేట్ వెర్షన్ 25.34.31 బీటాలో ఐఫోన్‌లోనూ క్విక్ షేర్ లభించేలా స్ట్రింగ్ ఉంటుంది. దీనికోసం ఐఓఎస్ కస్టమర్లు ఇప్పటికే ఆండ్రాయిడ్, విండోస్‌లలో క్విక్ షేర్ ఉన్నప్పటికీ విడిగా ఐఫోన్, మ్యాక్‌బుక్‌లలో క్విక్ షేర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఓఎస్‌లోని క్విక్ షేర్ యాప్‌కు గూగుల్ అకౌంట్ యాక్సెస్ అవసరం ఉండొచ్చు. అందుకే సైన్-ఇన్ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతానికి దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

Leave a Comment