
దిశ, ఫీచర్స్: కొచ్చిలో సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా పనిచేసే ఒక యువతి వీకెండ్ వ్యవసాయం చేస్తూ అర ఎకరంలో 300 రకాల రంగురంగుల పోర్టులాకా పుష్పాలను పండిస్తూూ రోజుకు 50-100 ఆర్డర్‌లను అందిస్తూ తన అభిరుచిని లాభదాయక వ్యాపారంగా మార్చింది.
హాబీ వ్యాపారంగా
కేరళలోని అలప్పుజ జిల్లా ముహమ్మా గ్రామానికి చెందిన 24 ఏళ్ల పార్వతి మోహనన్ ఇంజినీరింగ్ చదివేటప్పుడు కోవిడ్ కారణంగా ఊరికొచ్చింది. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న క్రమంలో ఇంట్లో కొన్ని పోర్టులాకా మొక్కలు కనిపించాయి. దానినొక హాబీగా మల్చుకొని ఇంకో 30 రకాల మొక్కలను కొనుగోలు చేసింది. ఫేస్‌బుక్‌లో మొక్కల ఫొటోలను పోస్ట్ చేసేది. ఈ పోస్ట్‌లు వివిధ గార్డెనింగ్ గ్రూపులలో ఆసక్తిని రేకెత్తించాయి. దీనినెందుకు బిజినెస్ చేసుకోవద్దని.. ఒక సేల్ పోస్ట్ పెట్టింది. 10 ఆర్డర్‌లు వచ్చాయి. చాలా తొందరగా తన హాబీ వ్యాపారంగా మారింది.
ఉద్యోగం చేస్తూనే..
బ్లాగర్స్, యూట్యూబ్ ఛానెల్‌ల కవరేజ్‌తో తన వ్యాపారానికి మరింత ఊపొచ్చింది. ఆర్డర్‌లు విపరీతంగా పెరిగాయి. ఎక్కువ రకాల పోర్టులాకా మొక్కలను కొనుగోలు చేయడానికి తగినంత డబ్బు లేదు. కొన్ని రకాలు ఒక్కో మొక్కకు రూ.5,000 ఖర్చు అవుతాయి. అందుకే లాభాలను పెట్టుబడిగా ఉపయోగించింది. ఇప్పుడు తన సేకరణ భారతదేశం నలుమూలల నుంచే కాకుండా థాయ్‌లాండ్, బ్రెజిల్ నుంచి సేకరించిన 300 వెరైటీస్‌తో ఆకట్టుకుంటోంది. గతేడాది ఒక పెద్ద కంపెనీలో ఐటీ జాబ్ వచ్చింది. ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు పోర్టులాకా మొక్కల వ్యాపారాన్ని బ్యాలెన్స్ చేస్తూ విజయవంతంగా కొనసాగిస్తోంది.
వారాంతపు సాగు..
అర ఎకరం పొలంలో రంగురంగుల పోర్టులాకా పుష్పాల తోటతో రంగురంగుల పుష్పాలను చూస్తే తనకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందట. తన హెక్టిక్ ఉద్యోగ వాతావరణం నుంచి ఇది చాలా ఉపశమనం ఇచ్చింది. ప్రతి వారాంతంలో గ్రామానికి తిరిగి వచ్చి తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. తను లేనప్పుడు తోటను చూసుకోవడానికి ఇద్దరు మహిళా కార్మికులను పెట్టింది. పోర్టులాకా సాగులో ఆమె నేర్చుకున్న సూక్ష్మ నైపుణ్యాలలో నేరుగా సూర్యరశ్మి, తక్కువ నీరు పోయడం, క్రమం తప్పకుండా కత్తిరించడం, ఆవు పేడ వంటి సేంద్రీయ ఎరువుల వాడకం వంటివి ఉన్నాయి.
ఇదీ విజయం అంటే..
ఒక హాబీగా ప్రారంభమైన పోర్టులాకా సాగు ఇప్పుడు లాభదాయక వ్యాపారంగా మారింది. ఆమె రోజుకు 50-100 ఆర్డర్‌లు అందిస్తూ నెలకు రూ.1 లక్ష ఆదాయం సంపాదిస్తోంది. తన వ్యాపారం వృద్ధి చెందుతున్న కొద్దీ, పార్వతి తన ఉద్యోగం అభిరుచిని సమతుల్యం చేస్తూ వ్యాపారాన్ని విస్తరించాలని కలలు కంటోంది. పార్వతి కథ కేవలం వ్యాపార విజయం గురించి మాత్రమే కాదు. ఇది అడ్డంకులను అధిగమించి అభిరుచిని అనుసరించడం గురించి ఒక పాఠం. ఒక హాబీ నుండి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆమె ప్రయాణం.. సాధారణ అభిరుచిని వృద్ధి చెందే వ్యాపారంగా మార్చే సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది.