యూరియాకు బదులుగా నానో యూరియా.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? రైతులెందుకు వ్యతిరేకిస్తున్నారు?

యూరియాకు బదులుగా నానో యూరియా.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? రైతులెందుకు వ్యతిరేకిస్తున్నారు?

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలు సహా.. దేశంలో యూరియా కొరత నెలకొన్న విషయం తెలిసిందే. యూరియా బస్తాల కోసం రైతులు వేకువ జాము నుంచే అమ్మకం కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. అయినా సరే.. పంటకు కావలసిన యూరియా బస్తా దొరకడం లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద యూరియా కావలసినంత ఉందని, కావాలనే గోదాముల్లో దాచి బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ.. రైతుల జేబులకు చిల్లు పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో రైతులకు నానో యూరియాను పంపిణీ చేసేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. కానీ.. అది తమకు వద్దంటున్నారు రైతులు. నానో యూరియా వల్ల పంటకు హాని జరుగుతుందా? రైతులు ఎందుకు నానో యూరియా వద్దంటున్నారు ? యూరియా కొరత ఉన్నప్పుడు నానో యూరియా వాడాల్సిందేనని ప్రభుత్వం ఎందుకంత గట్టిగా చెప్తోంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మనదేశంలో నానో యూరియా IFFCO (Indian Farmers Fertiliser Cooperative Limited) 2021లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం దీనిని పర్యావరణ హితమైనదిగా, పంట దిగుబడిని పెంచేదిగా చెప్తోంది కానీ.. రైతులు, శాస్త్రవేత్తలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజా అధ్యయనాలు, రైతుల అనుభవాల ప్రకారం.. నానో యూరియా .. యూరియాకు పూర్తిగా రీప్లేస్ మెంట్ కాదు. అలాగే పంట దిగుబడి కూడా తగ్గుతుంది. పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2024లో చేసిన అధ్యయనం ప్రకారం.. నానో యూరియా పిచికారి చేయడం వల్ల వరి దిగుబడి 12 శాతం, గోధుమ దిగుబడి 21.6 శాతం తగ్గినట్లు తెలిసింది. దీనితో పాటు ఇది లిక్విడ్ కావడంతో.. ఎక్కువ పొలం ఉన్నవారికి మందును పిచికారి చేసేందుకు లేబర్లు ఎక్కువగా కావలసి ఉంటుంది. పైగా ఒక పంటకాలంలో నానో యూరియాను 2-3 సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఫలితంగా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. యూరియా ద్వారా పంట దిగుబడి పెరిగితే నానో యూరియా వాడటం వల్ల దిగుబడి తగ్గుతుందని రైతులు విశ్వసిస్తున్నారు. పైగా పండించే పంటలో ప్రొటీన్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు.

నానో యూరియా- యూరియా మధ్య ఉన్న తేడా ఏంటి ?

రైతులు వ్యతిరేకిస్తున్న నానో యూరియాకు – యూరియాకు మధ్య కొన్ని తేడాలున్నాయి. 500 ఎంఎల్ నానో యూరియా బాటిల్ 50 కేజీల యూరియా బ్యాగ్ కు సమానంగా ఉన్నా.. కొన్ని ప్లస్, మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. యూరియాకు నానో యూరియాను పూర్తి రీప్లేస్మెంట్ గా వాడితే పంట దిగుబడి దారుణం పడిపోయే ప్రమాదం ఉంది.

నానో యూరియాను డైరెక్ట్ గా మొక్కలపై స్ప్రే చేస్తారు. 500 ఎంఎల్ బాటిల్ లో 20 గ్రాముల నైట్రోజన్ ఉంటే.. 45 కేజీల యూరియా బస్తాలో 46 శాతం నైట్రోజన్ ఉంటుంది. కానీ ఇది మట్టిలో పిచికారి చేయడం వల్ల పర్యావణం కలుషితమవుతుంది.

నానో యూరియా స్ప్రే చేయడం వల్ల 80-90 శాతం అందులో ఉన్న పార్టికల్స్ ను మొక్కలు వేగంగా గ్రహిస్తాయి. యూరియా పిచికారి వల్ల మొక్కలకు 25-30 శాతం పార్టికల్స్ మాత్రమే అందుతాయి. మిగతావి గాలి, నీటిలో, నేలలో కలిసిపోతాయి.

నానో యూరియా వాడకం వల్ల మట్టి, నీరు, గాలి కాలుష్యం తగ్గుతాయి. యూరియా వల్ల నైట్రేట్ లీచింగ్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లీషన్ వంటి సమస్యలు పెరుగుతాయి.

నానో యూరియాను వాడటం వల్ల యూరియా వాడకాన్ని 50 శాతం వరకూ తగ్గించవచ్చు కానీ.. ఇదే పూర్తిగా ప్రత్యామ్నాయం కాదు. యూరియా వాడకం పంటలకు బేసల్ నైట్రోజన్ అవసరాలను తీరుస్తుంది. అలాగే ప్రొటీన్ కంటెంట్ ను పెంచుతుంది.

నానో యూరియాను పూర్తిగా రీప్లేస్మెంట్ చేస్తే దిగుబడి 10-21 శాతం తగ్గే ఛాన్స్ ఉన్నట్లు పలు అధ్యయనాలు తెలిపాయి. రూట్ వాల్యూమ్, ప్రొటీన్ కంటెంట్ కూడా తగ్గవచ్చు.

యూరియాను ఎక్కువగా వాడటం కూడా మంచిది కాదు. దిగుబడి పెరిగినా నేల స్వభావం దెబ్బతింటుంది.

భారత్ లో 35 మిలియన్ టన్నుల యూరియాకు డిమాండ్ ఉండగా.. ప్రస్తుతం 26 మిలియన్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి అవుతోంది.

నానో యూరియా వాడితే ప్రభుత్వాలకు యూరియా దిగుమతుల ఖర్చు తగ్గుతుంది. ఒక ఏడాదికి సుమారు రూ.40 వేల కోట్లు ఆదా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నానో యూరియాను యూరియాతో 50-75 శాతం కలిపి వాడితే మంచి ఫలితాలు ఉంటాయని, యూరియాను పూర్తిగా పక్కనపెట్టేసి, నానో యూరియానే వాడితే ఒక్కోసారి ఆశించిన మేర ఫలితాలు కనిపించకపోవచ్చంటున్నారు.

నానో యూరియాను వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, నూనె గింజలు, పప్పు దినుసులు పంటలపై పిచికారి చేయవచ్చు. అయితే పంట ప్రధాన దశలో ఒకసారి.. కొద్దిరోజులకు మరోసారి పిచికారి చేయాల్సి ఉంటుంది. అంటే ఒక పంట కాలంలో రెండుసార్లు నానో యూరియాను స్ప్రే చేయాల్సి ఉంటుంది.

ఒక యూరియా బస్తా సబ్సిడీలో సుమారు రూ.300కు లభిస్తే.. నానో యూరియా అరలీటర్ బాటిల్ ధర రూ.240కే లభిస్తుంది. 

Leave a Comment