అయ్యో.. ఇంట్లో నేలపై వెళ్తున్న పురుగుని పట్టి నోట్లో వేసుకున్న ఏడాది చిన్నారి.. ఆ తర్వాత! – Telugu News | One year old Child dies after beetle enters windpipe in Tamilnadu

చెన్నై, ఆగస్ట్‌ 26: చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో 24 గంటలు అలర్ట్‌గా ఉండాలి. లేదంటే పిల్లలు తెలిసీ తెలియక చేసే పనులు చిక్కుల్లో పడేస్తాయి. చేతికి అందిన వాటిని నోట్లో పెట్టుకోవడం, లేదంటే నడుచుకుంటూ వెళ్లి బకెట్‌లోనో.. కాలువలోనే పడిపోవడం వంటివి చేస్తుంటారు. అందుకే తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. తాజాగా ఓ తల్లి నిర్లక్ష్యం మూలంగా ఏడాది వయసున్న చిన్నారి నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి.. సమీపంలో పురుగు కనిపించడంతో.. దాన్ని అమాంతం తీసుకుని నోట్లో పెట్టుకుంది. అంతే కాసేపటికే ఆ ఇంట తీవ్ర రోదనలు మిన్నంటాయి.  అసలు చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణం ఏమిటో పోస్టుమార్టం వరకు వైద్యులు కూడా కనుక్కోలేకపోవడం విశేషం. ఈ దారుణ ఘటన తమిళనాడులోని తిరువల్లూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళ్యం సమీపం తామరైపాక్కం శక్తి నగర్‌కి చెందిన గత పదేళ్లుగా ఓ అద్దె ఇంట్లో కార్తిక్‌ అనే రైతు కూలీ నివాసం ఉంటున్నాడు. ఆయన కుమార్తె గుగశ్రీ (1) సోమవారం ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటూ నేలపై పాక్కుంటూ వెళ్తున్న పురుగుని మింగేసింది. అది గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక చిన్నారి గుక్కపట్టి ఏడవ సాగింది. వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని తమరైపాక్కం ప్రాంతంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. కళ్లముందే పసికందు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

బిడ్డ మరణానికి కారణం తెలియక, గొంతులో ఇరుక్కుపోయిన తినుబండారం ముక్క తినడం వల్లే ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని తల్లిదండ్రులు తొలుత భావించారు. కానీ పోస్టుమార్టంలో అసలు సంగతి బయటపడింది. చిన్నారి శ్వాసనాళంలో పురుగు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పోస్ట్ మార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి నేలపై ఉన్న పురుగు పట్టుకుని మింగి మరణించిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment