కిలో బంగారం చూసి ఉంటారు. నగల షాపుకు వెళితే పది కిలోల నుంచి మహా అయితే వంద కిలోల బంగారు నగల దాకా చూసి ఉంటారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ దగ్గరున్న పసిడి కొండను చూస్తే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయం. దేశవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ బంగారం…ప్రభుత్వం దగ్గర గుట్టలుగుట్టలుగా పేరుకుపోయింది. అది ఏకంగా పుత్తడి కొండంత అయింది. గత పదేళ్లలో అధికారులు సీజ్ చేసిన బంగారం…అక్షరాలా 31,772.34 కిలోలట! 2015 నుంచి 2025దాకా పట్టుబడ్డ గోల్డ్ ఇది. అత్యధికంగా 2023–24లో 4,971.68 కిలోల బంగారం సీజ్ చేశారు అధికారులు. దీనికి సంబంధించి 35,888 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్ధికశాఖ…తాజాగా విడుదల చేసిన లెక్కల్లో తెలిపింది.
2023–24లో అధికంగా 4,971.68 కిలోల గోల్డ్ సీజ్
బంగారం అక్రమ తరలింపునకు సంబంధించి… 2015–16లో 2,815 కేసులు నమోదు కాగా, 2,972.07 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016–17లో కేసుల సంఖ్య 1,573కి తగ్గినా, 1,520.24 కిలోల బంగారం పట్టుబడింది. 2017–18లో 3,131 కేసులతో పాటు 3,329.46 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2018–19లో కేసులు 5,092కి పెరిగి, 4,292.29 కిలోల బంగారం సీజ్ చేశారు. 2019–20లో 4,784 కేసులు నమోదై 3,626.85 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2020–21లో కేసుల సంఖ్య 2,034కి తగ్గి, 1,944.39 కిలోల బంగారం మాత్రమే పట్టుబడింది. 2021–22లో 2,236 కేసులతో 2,172.11 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2022–23లో కేసులు 4,619కి పెరిగి, 4,342.85 కిలోల బంగారం సీజ్ చేశారు. అత్యధికంగా 2023–24లో 6,599 కేసులు నమోదు కాగా, 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2024–25లో కేసుల సంఖ్య 3,005గా ఉండగా, 2,600.40 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన గోల్డ్ విలువ రూ. 32 వేల కోట్లు
సాధారణ సమయాల్లో అక్రమంగా తరలించే బంగారం పట్టుబడితే, దాన్ని ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తారు పోలీసులు. అలాగే స్మగుల్డ్ గోల్డ్, ఇక ఎన్నికల సమయాల్లో పట్టుబడ్డ గోల్డ్‌ని కూడా ఐటీ శాఖకు అప్పగిస్తారు. ఐటీ డిపార్ట్‌మెంట్ దానిపై విచారించి, అది సక్రమమే అని తేలితే, ఓనర్లకు ఆ బంగారాన్ని అప్పగిస్తుంది. అయితే గత పదేళ్లలో దాదాపు 32 వేల కిలోల బంగారం ఐటీ శాఖ దగ్గరే ఉండిపోయిందంటే, ఆ గోల్డ్‌ని ఎవరూ క్లైయిమ్ చేసుకోలేదనే అర్థం. అంటే దేశంలో అక్రమంగా ఎంత బంగారపు లావాదేవీలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. దీని విలువ 32 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
ఈ గణాంకాలు చూస్తే, కొన్ని సంవత్సరాల్లో కేసుల సంఖ్య తగ్గినా, బంగారం స్వాధీనం పరిమాణం ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. ఇది అక్రమ రవాణా మార్గాల్లో మార్పులు, తనిఖీల తీవ్రత, అంతర్జాతీయ ధరల ప్రభావం వంటి అంశాల మీద, గోల్డ్ స్మగ్లింగ్ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి