
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఇండియా భారత మార్కెట్లో తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ ఫేస్‌లిఫ్ట్ కైగర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 6.29 లక్షల నుంచి రూ. 11.29 లక్షల(ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. అప్‌డేట్ చేసిన గ్రిల్, కొత్త బంపర్లు, అల్లాయ్ వీల్స్, రెనాల్ట్ నుంచి కొత్త లోగో సహా అనేక ఫీచర్లను ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చామని కంపెనీ వెల్లడించింది. 2021లో మార్కెట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఈ కాంపాక్ట్ ఎస్‌యూలో ఈ స్థాయి అప్‌డేట్ చేయడం ఇదే మొదటిసారి. ఇటీవలే కంపెనీ తన ట్రైబర్ మోడల్‌లో సరికొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఏడు రంగులు కొత్త డ్యూయల్-టోన్ ఒయాసిస్ ఎల్లో షేడ్‌తో పాటు రేడియంట్ రెడ్, కాస్పియన్ బ్లూ, ఐస్ కూల్ వైట్, మూన్‌లైట్ సిల్వర్, స్టీల్త్ బ్లాక్, పెర్ల్ వైట్ వంటి రంగుల్లో లభిస్తుంది. రెనాల్ట్ కొత్త డైమండ్ లోగోతో పాటు అప్‌డేట్ చేసిన ప్రధాన ఫీచర్లలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-వ్యూ 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ ఉన్నాయి. అలాగే, గతంలో రెండు మాత్రమే ఉన్న ఎయిర్‌బ్యాగ్‌ల సంఖ్యను ఆరుకు పెంచింది. హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో సహా 21 యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.