భారత క్రికెట్‌లో సుదీర్ఘ కాలం పాటు టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్‌గా పేరొందిన చతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత టెస్ట్ జట్టుకు నంబర్ త్రీ బ్యాట్స్‌మెన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పుజారా.. తన కెరీర్‌లో వందకు పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించిన పుజారా.. ఇకపై బీసీసీఐ నుంచి ఎంత పెన్షన్ అందుకోనున్నాడు అనే చర్చ మొదలైంది.
రిటైర్మెంట్ ప్రకటన..
చతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. చివరిసారిగా అతను 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. ‘‘భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం వంటివి మాటల్లో చెప్పడం అసాధ్యం. అపారమైన కృతజ్ఞతతో నేను అన్ని రకాల క్రికెట్ ఫార్మట్స్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను’’ అని పుజారా తన పోస్ట్‌లో రాశాడు.
బీసీసీఐ పెన్షన్ ప్లాన్ ?
భారత క్రికెట్ నియంత్రణ మండలి.. రిటైరైన ఆటగాళ్లకు వారి కెరీర్, మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా నెలవారీ పెన్షన్ అందిస్తుంది. ఈ పెన్షన్ మొత్తం జూన్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చింది. పురుష ఆటగాళ్లకు ఇది రూ. 30,000 నుండి రూ. 70,000 వరకు, మహిళా క్రికెటర్లకు రూ. 45,000 నుండి రూ. 52,500 వరకు ఉంటుంది. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు రూ. 70,000 పెన్షన్ పొందుతున్నారు.
పుజారాకు ఎంత పెన్షన్..?
పుజారా తన కెరీర్‌లో వందకు పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టీ20, వన్డేలలో అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌లో అతని సహకారం చాలా గొప్పది. 100కు పైగా టెస్ట్ మ్యాచ్‌లలో అతను 44 సగటుతో 7,200కు పైగా పరుగులు చేశాడు. అతని అద్భుతమైన కెరీర్, భారత క్రికెట్‌కు అందించిన సహకారాన్ని పరిగణనలోకి తీసుకుంటే..చతేశ్వర్ పుజారాకు నెలకు సుమారు రూ. 60,000 పెన్షన్ లభించే అవకాశం ఉంది. ఈ పెన్షన్ అతడికి ఆర్థిక భరోసాతో పాటు క్రీడాకారుడిగా అతడి సేవలకు ఇచ్చే గౌరవం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..