
దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కేంద్రం ప్రకటించిన జీఎస్టీ సంస్కరణల ప్రకటన అనేక రంగాల్లో ఉత్సాహం నింపింది. ముఖ్యంగా స్థిరాస్తి రంగంలో గిరాకీ పెరిగేందుకు జీఎస్టీ రేట్ల తగ్గింపు దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రతిపాదిన జీఎస్టీ తగ్గింపు ద్వారా ఇళ్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం 1 శాతం పన్ను పరిధిలో ఉన్న బడ్జెట్ ఇళ్లకు ఈ తగ్గింపు తక్కువే అయినప్పటికీ, ఇన్‌పుట్ ఖర్చులు దిగిరావడం, ముఖ్యంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్(ఐటీసీ) ద్వారా ధరలు 2-4 శాతం వరకు తగ్గుతాయి. మిడ్-రేంజ్ ఇళ్లకు సంబంధించి జీఎస్టీ 5 శాతం నుంచి 3 శాతం వరకు తగ్గుతుంది. తద్వారా ఈ విభాగంలో ఇళ్ల ధరలు 2-3 శాతం తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇక, లగ్జరీ విభాగంలో జీఎస్టీ సంస్కరణలు స్పష్టమైన తగ్గుదలను అందించనున్నాయి. ఎందుకంటే, ఇన్‌పుట్ ఖర్చులు తగ్గడమే కాకుండా ఈ ప్రాజెక్టులలో ఉపయోగించే లగ్జరీ వస్తువుల రేట్లు 40 శాతం మేర వాటా కలిగి ఉంటాయి. కాబట్టి జీఎస్టీ రేటు తగ్గింపు ద్వారా ధరల వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తుందని అనరాక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ అన్నారు.
ప్రధానంగా సిమెంట్, స్టీల్, టైల్స్, ఇతర కీలక నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ తగ్గింపు ఈ రంగానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమకు ఎక్కువ సానుకూల నిర్ణయం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు తాజా జీఎస్టీ తగ్గింపు మొత్తంగా నిర్మాణ వ్యయంపై భారాన్ని తగ్గిస్తుంది. ఇళ్ల కొనుగోళ్ల గిరాకీ గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నట్టు ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం సిమెంట్‌పై 28 శాతం, స్టీల్‌పై 18 శాతం, అన్ని ముడిసరుకుపైనా 18 శాతం జీఎస్టీ అమల్వుతోంది. తాజా నిర్ణయంతో ఖర్చు చాలా తగ్గుతుందని కాంకార్డ్ ఎండీ అనిల్ ఆర్‌జీ పేర్కొన్నారు.