ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితకు తాళి కట్టిన సీఐ.. కట్ చేస్తే ట్విస్ట్ అదిరింది..! – Telugu News | Madanapalle CI Suresh Kumar marries a woman came to file a complaint seeking justice in Annamayya District

న్యాయం కోసం ఫిర్యాదు చేయడానికి వచ్చిన వివాహితను మాయమాటలు లోబర్చుకున్నాడు. ఏకంగా తాళి కట్టి, రెండో పెళ్ళి చేసుకున్నాడు నంద్యాల సీసీఎస్ ఇన్స్‌పెక్టర్. ఈ వ్యవహారం ఆలస్యంగా బయటపడింది. తన భార్యను రెండో వివాహం చేసుకుని, తనకు అన్యాయం చేశాడని బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అన్నమయ్య జిల్లా మదనపల్లె ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్ దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 2018లో అన్నమయ్య జిల్లాకు చెందిన కలికిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అతనికి వివాహమైంది. వివాహ అనంతరం ఉద్యోగ రీత్యా దుబాయ్‌కు వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి వెళ్ళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో బాధితుడు పవన్ కుమార్ భార్య కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళింది. అ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తూన్న సీఐ సురేశ్ కుమార్ అమెతో పరిచయం పెంచుకున్నాడు. అ తర్వాత బాధితుడి భార్యను వివాహం చేసుకుని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు‌.

ఉద్యోగ రీత్యా దుబాయ్ లో ఉంటున్న పవన్ కుమార్ కు తన భార్యను సీఐ సురేష్ కుమార్‌ రెండో వివాహం చేసుకున్నట్లు ఆలస్యంగా తెలిసింది. ఇదే విషయంపై స్థానిక మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అంతే కాకుండా తన భార్య సీఐతో కలిసి 2023 లో ఒక బిడ్డకు జన్మనిచ్చిందని పేర్కొన్నాడు. తన భార్య సరిత వ్యవహారం శృతిమించడంతో భరించలేని పవన్ కుమార్ సీఐ సురేశ్ కుమార్ తోపాటు తన భార్య, సీఐ సురేష్ తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు.

దీంతో కోర్టు అదేశాల మేరకు మదనపల్లె ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివాహితతోపాటు సీఐ సురేష్ కుమార్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఛార్జీషీట్ వేయకుండా కాలయాపన చేస్తున్న మదనపల్లి పోలీసుల వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయానికి సైతం ఫిర్యాదు చేశాడు బాధితుడు. తన జీవితాన్ని నాశనం చేసిన సీఐ సురేష్ కుమార్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు పవన్ కుమార్ వేడుకుంటున్నాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment