నియోజకవర్గంలో ఇప్పటివరకు 294 మందికి రూ.2.44 కోట్ల లబ్ధి ……..మంత్రి దుర్గేష్
విశాలాంధ్ర – నిడదవోలు :కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు,చేస్తున్న అభివృద్ధితో ప్రజలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.ఆదివారం నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ సూపర్ సిక్స్ పథకాల అమలు తీరు, నిడదవోలు సమగ్రాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై మాట్లాడారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండించారు. అంతకు ముందు ఎంపీడీవో కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.నిడదవోలు నియోజక వర్గంలో అనారోగ్యం బారిన పడిన 58 మందికి రూ.29,72,186 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒకరికి రూ.2 లక్షల విలువైన ఎల్.వో.సీ పత్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు. ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 294 మందికి రూ.2 కోట్ల 45 లక్షల మేర లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఆపన్నులకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆపదలో ఉన్నవారికి నిరంతర ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం గా ముందుకు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
*దివ్యాంగుల పెన్షన్ల తొలగింపులో అర్హులెవరూ ఆందోళన చెందవద్దు:పెద్దఎత్తున దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి దుర్గేష్ ఖండించారు. కుల, మత, పార్టీ, ప్రాంత, వర్గాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శక విధానంలో సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఒకవేళ పొరపాటున అర్హులెవరికైనా పెన్షన్ తొలగిస్తే మళ్లీ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయంలో అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. కొందరు ఎలాంటి వైకల్యం లేకుండా అన్ని విధాలా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండికూడా పెన్షన్ పొందుతున్నట్లు పరిశీలనలో తేలిందన్నారు. అటు వంటి వారికి చెక్ పెడతామన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేశారన్నారు. గతంలో కొందరు అనర్హులు సంక్షేమ పథకాలు ప్రయోజనం పొందారని, అటువంటి వారిని తొలగించడం జరుగుతుందన్నారు.
నేటి నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ:ఆగస్టు 25 నుండి ప్రజలకు క్యూఆర్ కోడ్ తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ కార్డులు గతంలో మాదిరి పెద్ద పుస్తకాల్లా కాకుండా “ఏటీఎం కార్డు” తరహాలో స్మార్ట్ కార్డులు రాజముద్రతో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కార్యక్రమంగా నిడదవోలు నుండి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.వరదలపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు అర్థం పర్థం లేనివని మంత్రి కందుల దుర్గేష్అన్నారు.రాజధాని అమరావతి వరదలకు మునిగిందంటూ ప్రతి పక్షాలు నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిగిపోయింది రాజధాని కాదు నవరత్నాల పార్టీ అని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఎదుర్కునే సమర్థవంతమైన నాయకత్వం ఏపీకి ఉందని స్పష్టం చేశారు. *సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్: మంత్రి కందుల దుర్గేష్ :కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ఒక్కో హామీని నెరవేరుస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై బురదజల్లడానికే వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప ఏనాడైనా ఉచిత బస్సు పథకం అమలు చేయాలని ఆలోచించిరా..? అని మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం 5 కేటగిరి బస్సులకే వర్తింపజేయడంపై స్పష్టతనిచ్చారు. ఎక్కువ మంది మహిళలకు ఉపయోగపడే బస్సుల్లోనే పథకం అమలు చేస్తున్నా మన్నారు. ఇప్పటికే దీపం-2 పథకం’ద్వారా రెండు విడతల్లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు.కుటుంబంలో ఎంత మంది చదువుకుంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామని 2019లో చెప్పిన అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేసిన మాట వాస్తవం కాదా అని మంత్రి దుర్గేష్ ప్రతిపక్షాలను నిలదీశారు. ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం క్రింద కుటుంబంలో ఎంత మంది చదువుకుంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి పెట్టుబడి సాయం క్రింద అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ యోజన ద్వారా ఆర్థికసాయం అంద జేయడంపై రైతులంతా సంతోషంగా ఉన్నారని మంత్రి దుర్గేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతున్నప్పటికీ అన్నదాతకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు పథకం అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో రైతులను తగ్గించేందుకు, డబ్బులు తగ్గించేందుకు కులాన్ని ప్రాతిపదికన తీసుకున్నారని ఆరోపించారు.కుల మతాలకతీతంగా అర్హులైన ప్రతి రైతన్నకు ఆర్థికసాయం అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు.కేంద్ర ప్రభుత్వ సహకారంలో ఏపీలో పర్యాటక రంగం సమగ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని తెలిపారు.
*అభివృద్ధి పథంలో నిడదవోలు:మంత్రి దుర్గేష్;నిడదవోలు నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎమ్మెల్యేగా, మంత్రిగా సంపూర్ణ కృషి చేస్తున్నానన్నారు. రాష్ట్రస్థాయిలో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా తొలుత నిడదవోలులో అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నానన్నారు. రోడ్ల విషయంలో టెండర్లు ఖరారు అయ్యేందుకు ఆలస్యం అయిందని చెబుతూ రెండు మూడు రోజుల్లో ప్రక్కిలంక రోడ్డుకు టెండర్ ఖరారు అవుతుందన్నారు. అదే విధంగా కానూరు నుండి నిడదవోలుకు సిమెంట్ రోడ్డు వేయనున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ రోడ్లు వేసి లింక్ రోడ్ల పూర్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధికి నిధులు తీసుకొస్తామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు.