సహస్ర హత్య కేసు తల్లిదండ్రులకు హెచ్చరికలా మారింది. ఒక మైనర్ ఇంతటి ఘోరానికి ఒడిగట్టడం వెనుక ఉన్న కారణాలను లోతుగా విశ్లేషించాలి. ఎందుకంటే ఈ కేసులో నిందితుడు తన నేర ప్రణాళికలను ఒక డైరీలో రాసుకోవడం చూస్తే, ఇది కేవలం క్షణికావేశంలో చేసిన నేరం కాదని అర్థమవుతోంది. ఇది అతనిలో ఉన్న తీవ్రమైన మానసిక రుగ్మతలకు సంకేతం. నిందితుడు ఓటీటీలో క్రైమ్ సిరీస్‌లు చూసి ఈ నేరానికి ప్రణాళిక వేసుకున్నాడు. అంటే పిల్లలు ఓటీటీలో ఎంత ప్రమాదకరమైన కంటెంట్ చూస్తున్నారో ఈ ఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎంత శ్రద్ధ పెట్టాలో కూడా సహస్ర హత్య కేసు తెలియజేస్తోంది. పోలీసుల విచారణలో వెల్లడైన విషయాలు కూడా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. నిందితుడు స్కూల్‌కి కూడా సరిగ్గా వెళ్లేవాడు కాదని పోలీసుల విచారణలో తేలింది. నిజానికి చాలామంది తల్లిదండ్రులు పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారని భావిస్తారు. కానీ, వారు నిజంగా ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు గమనించాలంటున్నారు పోలీసులు.
నిజానికి ఇలాంటి ఆలోచనలు రాత్రికి రాత్రే రావు… పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టకపోతే మెల్లగా ఒక విధమైన మానసిక వికృతత్వానికి దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పిల్లలు ఏడుస్తున్నారనో… భోజనం చేయడం లేదనో అడిగింది కొనిచేస్తుంటారు. కొన్నిసార్లు పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ పెట్టి వదిలేస్తారు. కానీ, ఆ ఫోన్‌లో వారు చూసే కంటెంట్ మెదళ్లను భయంకరంగా ప్రభావితం చేయవచ్చని నిపుణుల హెచ్చరిక. పిల్లలు ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకునే లోపు, ఇంటర్నెట్‌లో కనిపించే హింసాత్మక కంటెంట్ వారి ఆలోచనలను కలుషితం చేస్తుంది. ఫోన్, ల్యాప్ టాప్, బైక్, కార్లు కావాలంటూ మొండిగా ఉన్న పిల్లలకు ముందే అర్థమైయ్యేలా చెప్పి కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలకు దారి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కేవలం బ్యాట్ కోసమే ఇదంతా జరిగిందంటే ఎవరూ నమ్మడంలేదు. పైగా ఇందులో బాలుడి తల్లిదండ్రుల పాత్రపైనా పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది బాధిత కుటుంబం. సహస్రను చంపిన బాలుడి వయసు కేవలం 15ఏళ్లు. పదోతరగతి. ఆ వయసులో పెద్ద కోరికలేముంటాయి. మహా అయితే మంచిబట్టలు, ఆడుకునే వస్తువులు, అప్పడప్పుడు సినిమాలు, పిక్‌నిక్‌లు పేరెంట్స్‌తో కలిసి టూర్‌లు, ఇంతకుమించి ఏముంటాయి..కానీ ఆసరదాలూ కూడా తీర్చలేని స్థితిలో పేరెంట్స్ ఉంటే ఆబాలుడు హంతకుడే కావాలా..? లేదుగా..? కానీ కూకట్‌పల్లి బాలుడు హంతకుడిగా మారాడు.
బాలుడి కోరికలు తీర్చే పొజిషన్‌లో అతడి కుటుంబం లేదు. అలాగనే బాలుడు ఏం చేస్తే దానికి తలూపడం తల్లిదండ్రులు చేస్తున్న పెద్ద తప్పు అంటున్నారు మానసిక నిపుణులు. కూకట్ పల్లి ఘటనలోనూ ఇదే జరిగింది. బాలుడు ఏం చేస్తున్నాడో తల్లిదండ్రులు పట్టించుకోలేదు. అసలు అతడి మానసిక పరిస్థితిపై ఆకుటుంబానికి ఓ అంచనా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బాలుడ్ని అతని తల్లి పదే పదే నువ్వేమైనా చేశావా అంటూ అడిగిందని..దానికి తనకేం తెలియదని బాలుడు బదులు కూడా ఇచ్చాడని పోలీసుల విచారణలో తెలిసింది. అంటే కన్నకొడుకును పేరెంట్స్ అనుమానంగా చూశారంటే..అతడి మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆ తల్లిదండ్రులకు తెలిసే ఉండొచ్చని బాధిత కుటుంబం అంటోంది.
బాలుడి దగ్గర ఓ ఫోనుంది. ఆఫోను కూడా తల్లిదండ్రులు కొనిచ్చింది కాదు. తనే కొనుక్కున్నానని పేరెంట్స్ చెప్పాడు. మరి చదుకునే పిల్లాడు ఫోన్ కొన్నాడంటే ఎలా కొన్నాడన్నది కూడా పేరెంట్స్ అడగలేదు. అంటే అతడ్ని పేరెంట్స్ వదిలేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా OTT ప్లాట్‌ఫారమ్‌లలోని క్రైమ్ సినిమాల ప్రభావం కూడా ఆబాలుడిపై ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. తీవ్రమైన హింసాత్మక సంఘటనలు బాలుడిపై తీవ్ర ప్రభావం చూపించిందని మానసిక నిపుణులు చెబుతున్నారు.