‘లోక‌ల్’ ఫైట్‌పై వచ్చిన క్లారిటీ.. సెప్టెంబర్‌‌‌లో నిర్వహించేందుకు సర్కార్ ప్లాన్

‘లోక‌ల్’ ఫైట్‌పై వచ్చిన క్లారిటీ.. సెప్టెంబర్‌‌‌లో నిర్వహించేందుకు సర్కార్ ప్లాన్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నెలలో నిర్వహించాలని అధికార కాంగ్రెస్ ​ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎలక్షన్స్‌పై పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించనున్నారు. నేడు గాంధీ భవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం (పీఏసీ), టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరు కానున్నారు.

అభిప్రాయాల సేకరణ

నేడు జరిగే పీఏసీ సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు​కల్పించి ఎన్నికలకు వెళ్లాలా? లేదా వెంటనే నిర్వహించాలా? అనే దానిపై అభిప్రాయాలు సేకరించనున్నారు. దీంతో పాటు ‘ఓట్ చోర్​గద్దీ చోర్’​ అంశంపై రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని పార్టీ కేడర్ ఎంతో ఆశతో ఎదురు చూస్తోందని ఇప్పటికే అనేక మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు నిలిచిపోవడంతో కేంద్రం నుంచి నిధులు రావడంలేదని, గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకు పోతున్నాయని మరికొంత మంది ముఖ్య నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

25న కేబినెట్‌ భేటీలో నిర్ణయం

ఎన్నికలపై పీఏసీ సమావేశంలో నేతల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈనెల 25న జరిగే కేబినెట్ మీటింగ్‌లో అధికారిక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల​కోసం కాంగ్రెస్​ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని, ఢిల్లీలో ధర్నా సైతం చేసిందని, అయినా కేంద్రం నుంచి కదలిక లేదని నేతలు చెబుతున్నారు. మరో వైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. వీటన్నంటి నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, వినాయక నిమజ్జనం తర్వాత ఎన్నికల షెడ్యూల్​విడుదలయ్యేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

సెప్టెంబర్‌లో స్థానిక ఎన్నికలు!

రాష్ట్రంలో కులగణన నిర్వహించిన ప్రభుత్వం అందులో బీసీల శాతాన్ని శాస్త్రీయంగా తేల్చింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సులువు అవుతుందని అంచనా వేసింది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపింది. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోవడంతో స్థానిక ఎన్నికల్లో బీసీలకు గతంలో ఉన్న రిజర్వేషన్‌నే అమలు చేసి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఖాయమని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు.

Leave a Comment