Sharmila Meeting Jagan: జగన్ తో షర్మిల భేటీ?

Sharmila Meeting Jagan: దేశంలో ఉపరాష్ట్రపతి( vice president) ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. ఇండియా కూటమి తరుపున తెలుగు వారైనా రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే తాను ఏ రాజకీయ పక్షం తరుపున నిలబడడం లేదని.. స్వతంత్రంగా పోటీ చేస్తున్నానని సుదర్శన్ రెడ్డి చెబుతున్నారు. అయితే సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, ఏపీలో షర్మిల గట్టిగానే పోరాటం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా తెలుగు వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పక్షాల నేతలను కలిసి మద్దతు పొందాలని భావిస్తున్నారు. దీంతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని తెలుస్తోంది. అయితే ఆ మూడు రాజకీయ పార్టీలు ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు విషయంలో స్పష్టతనిచ్చాయి.

Also Read: ఏపీలో ఎస్టీ జాబితాలోకి ఆ రెండు కులాలు?

* ఏపీలో అన్ని ఓట్లు ఎన్డీఏకు..
ప్రస్తుతం ఏపీలో( Andhra Pradesh) ఎంపీల సంఖ్య దాదాపు 40 మందికి పైగా ఉన్నారు. అయితే ఆ ఓట్లన్నీ గుంప గుత్తిగా ఎన్డీఏ అభ్యర్థికి పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. ఏపీలో టీడీపీ కూటమిలో బిజెపి భాగస్వామ్య పక్షంగా ఉంది. సో వీటికి జనసేన తోడుగా ఉంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎంపీల బలం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపింది. అందుకే తెలుగు రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ పార్టీ భిన్న వైఖరితో ముందుకెళ్తోంది. లోకల్ సెంటిమెంట్ తేవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ని కలవాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే షర్మిల సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. వారిద్దరినీ కలిసిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని ప్రచారం సాగుతోంది.

* ఇద్దరి మధ్య అగాధం
సోదరుడు జగన్మోహన్ రెడ్డిని ( Y S Jagan Mohan Reddy )గత కొంతకాలంగా రాజకీయంగా విభేదిస్తున్నారు షర్మిల. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు షర్మిల. వారి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అయితే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో వివాదం పెరిగింది. వారి మధ్య గ్యాప్ అగాధానికి దారితీసింది. క్రమేపీ ఆమె తెలంగాణ రాజకీయాల వైపు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గర.. ఆ పార్టీ ఏపీ చీఫ్ గా నియమితులయ్యారు. కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విభేదించారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని భారీగా డ్యామేజ్ చేయగలిగారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఏడాది అవుతున్న జగన్ విషయంలో అదే ఫార్ములాతో ముందుకు సాగుతున్నారు. ఆయనతో వేదికలు పంచుకునేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. చివరకు తండ్రి రాజశేఖరరెడ్డి జయంతి, వర్ధంతి సమయంలో కూడా సామూహిక ప్రార్థనలకు కూడా ఇష్టపడడం లేదు. అటువంటిది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం జగన్మోహన్ రెడ్డిని కలుస్తారా? లేదా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది.

* కాంగ్రెస్ పై జగన్ విముఖత
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా బీజేపీ విషయంలో తన పాత ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే అది కేసుల భయంతోనని స్పష్టం అవుతోంది. అందులో భాగంగానే ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఆ బలం మరింత పెరిగితే జగన్ లో పునరాలోచన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు షర్మిల కలుస్తానంటే జగన్ అపాయింట్మెంట్ ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.

Leave a Comment