Ranil Wickremesinghe: శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్.. విచారణకు పిలిచి అదుపులోకి తీసుకున్న సీఐడీ.. ఏ కేసులో అంటే..? – Telugu News | Former Sri Lankan President Ranil Wickremesinghe Arrested for Misusing Govt Funds

శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు సీఐడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసింది. రణిల్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులను వ్యక్తిగత ప్రయాణాలకు ఉపయోగించుకున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. లండన్‌లో తన భార్య ప్రొఫెసర్ మైత్రీ విక్రమసింఘే స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రభుత్వ ఖజానాను ఉపయోగించారని సీఐడీ ఆరోపించింది. ఈ క్రమంలో శుక్రవారం ఆయన్ని విచారణకు పిలిచింది. విచారణ తర్వాత అరెస్ట్ చేసినట్లు సీఐడీ ప్రకటించింది. తగిన ఆధారాలు ఉండడం వల్లే అరెస్టు చేశామని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.

ఆరోపణలు – వివరణ

2023 సెప్టెంబర్‌లో విక్రమసింఘే క్యూబాలోని హవానాలో జరిగిన G77 సమావేశానికి హాజరయ్యారు. అక్కడి పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా.. లండన్‌లో తన భార్య స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ పర్యటనలోని లండన్‌కు సంబంధించిన ప్రయాణ, భద్రతా సిబ్బంది ఖర్చులను ప్రభుత్వ నిధుల నుండి చెల్లించినట్లు సీఐడీ ఆరోపిస్తోంది. ఈ ఖర్చు మొత్తం వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిగిందని దర్యాప్తు సంస్థ తెలిపింది. అయితే మాజీ అధ్యక్షుడు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తన ప్రయాణ, బస ఖర్చులను స్వయంగా భరించానని.. ప్రభుత్వ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అరెస్టును ఆయన రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు.

రాజకీయ నేపథ్యం

2022 జూలైలో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు.. గోటబయ రాజపక్సే రాజీనామా చేశారు. దీంతో విక్రమసింఘే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలంలో దేశ ఆర్థిక పరిస్థితిని కొంతమేర చక్కదిద్దగలిగారు. గత ఏడాది సెప్టెంబర్ 2024లో జరిగిన ఎన్నికల్లో వామపక్ష నేత అనుర కుమార దిసనాయకే చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment