DK Shivakumar : కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆయన.. త్వరలో బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని..

DK Shivakumar
Updated On : August 22, 2025 / 2:07 PM IST
DK Shivakumar : కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో డీకే శివకుమార్ (DK Shivakumar) అంశం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన.. త్వరలో బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని కొద్దిరోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే సమయంలో అసెంబ్లీలో డీకే శివకుమార్ వ్యవహరించి తీరు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: వీధికుక్కల కేసులో సుప్రీంకోర్టు మరో సంచలనం.. గతంలో ఇచ్చిన ఆదేశాలు మోడిఫై.. తాజాగా ఏం చెప్పిందంటే..
అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం..
కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో ఇటీవల డీకే శివకుమార్ తన రాజకీయ జీవితం గురించి మాట్లాడారు. ఈ సమయంలో ఆర్ఎస్ఎస్‌తో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ గీతమైన ‘నమస్తే సదా వత్సలే’ అనే గీతాన్ని శివకుమార్ అసెంబ్లీలో పాడారు. దీంతో బీజేపీ సభ్యులంతా చిరునవ్వులు చిందిస్తూ, బల్లలపై చప్పట్లు చరుస్తూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో శివకుమార్ కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారని చర్చ మొదలైంది. కాంగ్రెస్ అధిష్టానం సీఎం పీఠాన్ని ఆయనకు అప్పగించకుంటే బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Also Read: China Slams Trump: భారత్, చైనా ఆసియాకు డబుల్ ఇంజిన్లు.. ఇండియాకు బీజింగ్ ఫుల్ సపోర్ట్.. ట్రంప్ సుంకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రకటన
ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర..
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఆయనకే సీఎం పదవి దక్కుతుందని మెజార్టీ వర్గం ప్రజలు భావించారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు సీఎం పదవి అప్పగించింది. డీకే వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు చెరో రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగేలా కాంగ్రెస్ అధిష్టానం ఒప్పందం కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి.
సీఎం పీఠంపై పార్టీలో అంతర్గత కలహాలు..
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై పార్టీలో కొద్దికాలంగా అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయి. ఇటీవల పలు కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటకు రావడంతో సీఎంగా ఆయనను తొలగించాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, ఐదేళ్లూ తానే సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య చెబుతుండగా.. సీఎం మార్పునకు పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో డీకే శివకుమార్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలు సందర్భాల్లో బహిరంగంగానే ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు. కానీ, కేంద్ర పార్టీ అధిష్టానం మాత్రం ఆ మేరకు డీకే శివకుమార్‌కు సహకారం అందించడం లేదని ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో డీకే పార్టీ మార్పు అంశంపై కొద్దిరోజులుగా కర్ణాటకలో చర్చ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డీకే శివకుమార్ అసెంబ్లీ వేదికగా ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం, అందుకు బీజేపీ సభ్యులు హర్షధ్వానాలు వ్యక్తం చేయడంతో ఆయన బీజేపీలోకి వెళ్తారన్న వాదనకు బలంచేకూర్చినట్లయిందని సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.
DK Shivakumar singing the RSS anthem in the House.
Maybe that’s his way of telling Siddaramaiah to vacate the chair before it’s too late.
Karnataka government looks on shaky ground 😂 pic.twitter.com/yAACBqMSao
— Meme Farmer (@craziestlazy) August 22, 2025