మూసీలో బోటు షికారు..

హైదరాబాద్ వాసులకు త్వరలో సరికొత్త పర్యాటక అనుభూతి !
నదిని శుభ్రపరిచి కృష్ణా, గోదావరి నీటితో నింపేందుకు యోచన

హైదరాబాద్ నగరవాసులకు త్వరలోనే సరికొత్త పర్యాటక అనుభూతి అందుబాటులోకి రానుంది. హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు తరహాలో ఇకపై చారిత్రక మూసీ నదిలో కూడా బోటింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మూసీ ప్రక్షాళన, సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రతిపాదనకు మళ్లీ జీవం వచ్చినట్టయింది. మూసీ నదిని పర్యాటక కేంద్రంగా మార్చే బృహత్తర ప్రణాళికలో భాగంగా అధికారులు ఈ బోటింగ్‌ను ప్రతిపాదించారు. ముందుగా నదిలోని కలుషిత నీటిని పూర్తిగా తొలగించి, నదిని శుభ్రపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత కృష్ణా, గోదావరి జలాలను మూసీలోకి తరలించి స్వచ్ఛమైన నీటితో నింపాలని భావిస్తున్నారు. బోటింగ్ నిర్వహణకు ఏడాది పొడవునా నీటిమట్టం స్థిరంగా ఉండటం ముఖ్యం. ఇందుకోసం సుమారు 5 నుంచి 6 కిలోమీటర్ల పొడవున చెక్ డ్యామ్‌లు నిర్మించి నీటిని నిల్వ చేయాలని అధికారులు ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ బోటింగ్ ప్రాజెక్టును మూసీ వెంట చేపట్టనున్న రోడ్ కమ్ మెట్రో రైల్ విస్తరణతో అనుసంధానం చేయనున్నారు. మెట్రో రెండో దశలో భాగంగా నాగోలు నుంచి గండిపేట వరకు మూసీ నది వెంబడి ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులోనే మూసీ సుందరీకరణ, బోటింగ్ నిర్వహణకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నగర పరిధిలో నార్సింగి నుంచి బాపూఘాట్, హైకోర్టు, చాదర్‌ఘాట్ మీదుగా నాగోలు వరకు విస్తరించి ఉన్న మూసీ మార్గంలో, బోటింగ్‌కు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి తొలుత అక్కడ ఈ సదుపాయాన్ని ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్ 13న జరిగిన సమావేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ, రోడ్ కమ్ మెట్రో రైల్ కనెక్టివిటీపై ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అప్పట్లోనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇప్పుడు సీఎం మరోసారి ఈ అంశంపై దృష్టి సారించడంతో, హైదరాబాద్‌కు మరో పర్యాటక ఆకర్షణ తోడవనుందన్న ఆశ నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.

Leave a Comment