Dream11: రియల్-మనీ గేమింగ్ వ్యాపారం మూసేస్తున్న డ్రీమ్11

Dream11: రియల్-మనీ గేమింగ్ వ్యాపారం మూసేస్తున్న డ్రీమ్11

దిశ, బిజినెస్ బ్యూరో: నగదు చెల్లింపులతో ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిర్వహణను నిషేధించే కీలక బిల్లును తాజాగా కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రంగంలో ఉన్న అనేక కంపెనీలు భారీ నష్టాలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన డ్రీమ్11 తన రియల్-మనీ గేమింగ్ వ్యాపారాన్ని మూసేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ దీనికి సంబంధించి ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం తెచ్చిన ‘ది ప్రమోషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు, 2025’ కేవలం ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమింగ్‌కు మాత్రమే అనుమతిస్తుంది. ఒకవేళ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి ఫాంటసీ స్పోర్ట్స్, పోకర్, రమ్మీతో సహా నగదు ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌లను నిర్వహిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ. కోటి జరిమానా తప్పదు. దీంతో ఈ రకమైన గేమ్స్ నిర్వహణ చట్టబద్ధంగా కుదరదని డ్రీమ్ స్పోర్ట్స్ సీఈఓ హర్ష్ జైన్ ఫుల్-టైమ్, కాంట్రాక్టు ఉద్యోగులకు చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌కు కార్యకలాపాలను తరలించిన డ్రీమ్11 కంపెనీకి ఇది పెద్ద దెబ్బ కానుంది. ఎందుకంటే, కంపెనీకి వచ్చే ఆదాయంలో 90 శాతం కంటే ఎక్కువ రియల్-మనీ గేమింగ్ ద్వారానే వస్తోంది. 2023-24లో కంపెనీ వీటి ద్వారానే రూ. 9,600 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అయితే, ఇందులో ఎక్కువ భాగం క్రికెట్ వరల్డ్ కప్ భాగస్వామ్యం ద్వారా వచ్చింది. 

Leave a Comment