India-US relations: భారత్–అమెరికా సంబంధాలు ఇటీవలి కాలంలో గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించడం, ఈ నిర్ణయం కేవలం ఆర్థిక విధానం కంటే వ్యక్తిగత, రాజకీయ కోణాలను కలిగి ఉండొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్ దక్షిణాసియా విశ్లేషకుడు మైఖెల్ కూగ్లెమన్ ప్రకారం, భారత్–అమెరికా సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి.
టారిఫ్‌ల వెనుక వ్యక్తిగత అక్కసు..
అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లు కేవలం వాణిజ్య విధానంగా కనిపించినప్పటికీ, వాటి వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ భారత్‌పై అసంతృప్తికి ప్రధాన కారణం, భారత్ ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడం. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూరు విరామంలో తన పాత్రను భారత్ అంగీకరించకపోవడం ట్రంప్‌కు కోపం తెప్పించి ఉండొచ్చని కూగ్లెమన్ అభిప్రాయపడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ఈ విషయంలో మూడో దేశం జోక్యం లేదని స్పష్టం చేయడం ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. భారత్ తన విదేశాంగ విధానంలో స్వతంత్ర వైఖరిని కొనసాగిస్తోంది. ఈ స్వతంత్రత అమెరికా ఆశించిన సహకారానికి విరుద్ధంగా ఉండడం వల్ల ట్రంప్ అసంతృప్తికి కారణమైందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించకపోవడం ఈ ఘర్షణకు దారితీసింది.
Read Also: ప్రముఖ హాట్ హీరోయిన్ పై పోలీస్ కేసు..ఇండస్ట్రీ మొత్తం షాక్!
ఆపరేషన్ సిందూరు వివాదం
ఆపరేషన్ సిందూరు విరామంలో తానే కీలక పాత్ర పోషించానని ట్రంప్ పదేపదే ప్రకటించారు. అయితే, భారత్ ఈ వాదనలను స్పష్టంగా తిరస్కరించింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయంలో ఎలాంటి మూడో దేశ ప్రమేయం లేదని పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ తిరస్కరణ ట్రంప్ వ్యక్తిగతంగా, రాజకీయంగా అసంతృప్తి చెందడానికి దారితీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తన విదేశాంగ విజయాల ద్వారా నోబెల్ శాంతి బహుమతిని లక్ష్యంగా చేసుకున్నారని, భారత్ ఆయన పాత్రను అంగీకరించకపోవడం ఈ లక్ష్యానికి అడ్డంకిగా మారిందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంలో టారిఫ్‌లు విధించడం ఒక రకమైన రాజకీయ ఒత్తిడి వ్యూహంగా కనిపిస్తోంది.
Read Also: టారిఫ్ యుద్ధంలో దేశమంతా ఒక్కటయ్యింది ఒక్క రాహుల్ గాంధీ తప్ప
పాకిస్తాన్‌తో సతస్సంబంధాలు..
ట్రంప్ కుటుంబం పాకిస్తాన్ సహకారంతో క్రిప్టో వ్యాపారంలోకి ప్రవేశించడం, అలాగే అమెరికా సంస్థలను పాకిస్తాన్‌లో చమురు అన్వేషణకు ప్రోత్సహించడం వంటి చర్యలు ఇస్లామాబాద్‌తో సన్నిహిత సంబంధాలను సూచిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల భారత్‌ను కవ్వించే విధంగా, భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ నుంచి చమురు కొనుగోలు చేసే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశాలతో కూడినవిగా భావిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రెండు నెలల వ్యవధిలో మరోసారి అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) కమాండర్ మైఖెల్ కురిల్లా రిటైర్మెంట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇటీవల కురిల్లా పాకిస్తాన్‌ను ఉగ్రవాద వ్యతిరేక పోరులో అద్భుతమైన భాగస్వామిగా కొనియాడడం గమనార్హం. ఈ సంబంధాలు భారత్–అమెరికా సంబంధాలపై మరింత ఒత్తిడిని కలిగిస్తున్నాయి.
చమురు అన్వేషణలో పాకిస్తాన్ వైఫల్యం
పాకిస్తాన్‌లో చమురు అన్వేషణ ప్రయత్నాలు గతంలో విఫలమయ్యాయి. ఇటలీ, కువైట్, షెల్, టోటల్ ఎనర్జీస్ వంటి సంస్థలు చమురు అన్వేషణలో నిమగ్నమై విఫలమైనట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ కూడా కెక్రా–1 ప్రాజెక్టులో డ్రిల్లింగ్ చేసి ఫలితం లేకపోవడంతో విరమించుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చమురు అన్వేషణకు అమెరికా సంస్థలను ప్రోత్సహించడం ఆచరణీయమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.