పాక్‌ గూఢచారిగా యూట్యూబర్‌ – అరెస్ట్‌ చేసిన హర్యానా పోలీసులు

ఓ యూట్యూబర్‌ తన వీడియోలు తాను చేసుకోక.. చాలా పెద్ద తప్పిదం చేసింది. దేశ రక్షణ సమాచారంపై గూఢచర్యం చేసింది. ఏకంగా భారత సైనిక రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌ సైన్యానికి చేరవేసిందట. దీంతో, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమెతో పాటు పలువురిని అరెస్ట్‌ చేశారు.

‘ట్రావెల్ విత్ జో’ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా, భారత సైనిక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో, దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లను దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో పర్యటించింది. ఆ సమయంలో అక్కడ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్‌గా పనిచేసి, భారత దేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు నిఘా విభాగం గుర్తించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రావెలోగ్‌, టూరిజానికి సంబంధించిన వీడియోలు రూపొందించే జ్యోతి మల్హోత్రా, పాకిస్థాన్‌కు సీక్రెట్‌ ఆర్మీ ఇన్ఫర్మేషన్‌ అందించారన్నది ప్రధాన అభియోగం. ఢిల్లీలో పాకిస్థాన్ హై కమిషన్ అధికారి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయని, పాకిస్థాన్‌లో పర్యటించిన సమయంలో భారత సైనిక సమాచారాన్ని ఐఎస్‌ఐకి చేరవేసిందని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.

జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన విషయాన్ని హిసార్ పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై హిసార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు రాసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, జ్యోతి మల్హోత్రా 2023లో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌ను సందర్శించారు. అక్కడ ఆమెకు పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో పరిచయం ఏర్పడింది. తాను డానిష్‌తో టచ్‌లో ఉన్నానని, 2023లో పాకిస్థాన్‌లో పర్యటించిన సమయంలో అలీ ఎహ్వాన్‌ను కలిశానని, తన అకామడేషన్, జర్నీ ఏర్పాట్లను అలీయే చూసుకున్నాడని జ్యోతి మల్హోత్రా విచారణలో వెల్లడించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అలీ ఎహ్వాన్ ఆమెను పాకిస్థాన్ భద్రతా, నిఘా అధికారులకు పరిచయం చేశాడని, అక్కడ ఆమె షకీర్, రాణా షాబాజ్‌లను కూడా కలిసిందని ఎఫ్‌ఐఆర్‌లో రాశారు. అంతేకాకుండా, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు షకీర్ పేరును తన ఫోన్‌లో ‘జాట్ రణధావా’ అని జ్యోతి మల్హోత్రా సేవ్ చేసుకుంది. 2023లో పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె వాట్సప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా తన సహచరులతో సమాచారం షేర్‌ చేసుకుందని హిసార్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

అయితే, గడిచిన రెండేళ్లలో జ్యోతి మూడుసార్లు పాకిస్థాన్‌ సందర్శించినట్లు అనుమానిస్తున్నారు. యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్, యూఏఈ వంటి దేశాల్లో కూడా జ్యోతి పర్యటించింది. పాకిస్థాన్‌లోని పరిస్థితులను తన సోషల్ మీడియా ద్వారా పర్యాటకులకు అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతను పాక్ నిఘా అధికారులు జ్యోతికి అప్పగించినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Comment