రష్యాలో సునామీ బీభత్సం సృష్టించింది. కమ్చట్కా సమీపంలో 4 మీటర్ల వరకు అలలు ఎగసిపడ్డాయి. భూకంపం తీవ్రత 8.8గా నమోదయింది. జపాన్‌ను కూడా సునామీ తాకింది. జపాన్ తీరంలో 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడ్డాయి. అత్యవసర సేవలకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది జపాన్. హవాయిలోని హోనోలులులో సునామీ సైరన్లు మోగించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలస్కా, ఒరెగాన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ హెచ్చరికలతో భారత్ కాన్సులేట్ అప్రమత్తం అయింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేసింది. హెల్ప్‌లైన్ నెంబర్ 1-415-483-6629 ఏర్పాటు చేసింది.
భూకంప కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్స్కీ నగరానికి 119 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 1952 తర్వాత కమ్చట్కా ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు. హవాయి, అలాస్కా, అమెరికా పశ్చిమ తీరం, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఈక్వెడార్, చిలీ, గ్వాటెమాల, కోస్టా రికా, పెరూ, మెక్సికో, ఇతర పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హవాయిలో తీరప్రాంతవాసులను ఎత్తైన ప్రాంతాలకు లేదా భవనాల 4వ అంతస్తుకు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించారు.
జపాన్‌లోని హొక్కైడో నుంచి ఒకినావా వరకు 9 లక్షల మందికి పైగా ప్రజలకు ఖాళీ చేయమని సూచించారు అధికారులు. రష్యా కురిల్ దీవులలోని సెవెరో-కురిల్స్క్‌లో 3-4 మీటర్ల ఎత్తున విరుచుకుపడ్డా సునామీ అలలు. తీర ప్రాంతంలో ఉన్న భవనాలు నీట మునిగిపోయాయి. జపాన్‌లోని హొక్కైడోలోని నెమురో హనసాకి ఓడరేవులో 30 సెంటిమీటర్ల ఎత్తులో మొదటి సునామీ అల ఎగిసిపడినట్టు అధికారులు గుర్తించారు. అలాస్కాలోని అమ్చిట్కా దీవిలో ఒక అడుగు ఎత్తైన సునామీ అల నమోదైంది.
రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో భవనాలు దెబ్బతిన్నాయి. పలువురికి గాయాలయ్యాయి. జపాన్‌లోని హొక్కైడోలోని తీరప్రాంతంలో గోదాములు సునామీ అలల ధాటికి కొట్టుకుపోయాయి. రష్యాలోని సెవెరో-కురిల్స్క్ పట్టణంలో ఓడరేవు మునిగిపోయింది. అమెరికా పశ్చిమ తీరం, బ్రిటిష్ కొలంబియా, అలాస్కా సునామీ అడ్వైజరీ జారీ అయింది.
కాలిఫోర్నియాలోని డెల్ నోర్టే కౌంటీలో 5.4 అడుగుల వరకు అలలు రావచ్చని అంచనా, లాస్ ఏంజిల్స్‌లో 1 అడుగు కంటే తక్కువ ఎత్తులో అలలు తాకే అవకాశం ఉంది. వాషింగ్టన్ తీరంలో అలలు రాత్రి (స్థానిక కాలమానం) గం. 10:30 నుంచి 11:50 వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అలల గరిష్ట ఎత్తు ఎత్తు 0.8 నుండి 1.4 అడుగులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. US నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం ముంపు ప్రభావం తక్కువే ఉంటుందని, అయితే సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుందని వెల్లడించారు.