KCR’s strategy: అప్పుడు బాబు.. ఇప్పుడు లోకేష్..బిఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రం!

KCR strategy

KCR’s strategy: తెలంగాణ( Telangana) సెంటిమెంట్ తోనే కెసిఆర్ రాజకీయాల్లో రాణించారు. రెండుసార్లు అధికారంలోకి రాగలిగారు. అయితే ఈ రెండు సార్లు కూడా చంద్రబాబును బూచిగా చూపించారు. కేవలం చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా చూపి.. ఆ సెంటిమెంట్ ద్వారా అధికారంలోకి వచ్చారు కెసిఆర్. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ వారసులు సైతం అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. ప్రధానంగా లోకేష్ ను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఒకరు.. లోకేష్ వ్యాఖ్యలను వక్రీకరించడం ద్వారా మరొకరు తెలంగాణలో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఒక్కోసారి రాజకీయ ప్రత్యర్థుల చర్యలు బట్టి లాభ పొందుతుంటారు. ఈ విషయంలో చంద్రబాబును చూపించి కెసిఆర్ రాజకీయంగా లబ్ధి పొందారు. ఏ చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారో.. అదే చంద్రబాబు నామస్మరణ చేస్తున్నారు. అసలు చంద్రబాబు లేనిదే బిఆర్ఎస్ ఉనికికే ప్రమాదం అన్న నిజాన్ని గుర్తు చేస్తున్నారు.

సెంటిమెంట్ అస్త్రంతో కెసిఆర్..
కేవలం చంద్రబాబు( CM Chandrababu) మంత్రి పదవి ఇవ్వలేదన్న మనస్థాపంతోనే తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు కెసిఆర్. సుదీర్ఘకాలం రాజకీయం చేశారు. చంద్రబాబును రాజకీయంగా విభేదించి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చారు. అదే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు అదే చంద్రబాబుతో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డారు కేసీఆర్. అయితే చంద్రబాబును ద్వేషించడం ద్వారా తెలంగాణ సమాజంలో ఆయనను బూచిగా చూపించారు. తద్వారా తాను అనుకున్నది సాధించారు. రెండుసార్లు అలానే అధికారంలోకి వచ్చారు. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దానికి తన స్నేహితుడు జగన్ సహకారం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా నాగార్జునసాగర్ డ్యామ్ మీదకు దండయాత్ర చేశారు. సరిగ్గా 2023 తెలంగాణ ఎన్నికల పోలింగ్ సమయంలో ఈ చర్యకు దిగారు. తద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిల్చి మరోసారి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. కానీ రేవంత్ ప్రభంజనంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉంది.

బనకచర్ల ప్రాజెక్టు వివాదంతో..
అయితే ఇప్పుడు కూడా చంద్రబాబును మరోసారి అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని భావిస్తున్నారు కేసీఆర్( KCR) అండ్ కో. చంద్రబాబు బనకచర్ల అనేసరికి వీరికి ఊపిరి వచ్చింది. అదిగో చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తుంటే రేవంత్ మౌనంగా ఉన్నారని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన యువ నేతలు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై బిఆర్ఎస్ చేస్తున్న అభ్యంతరాలపై మంత్రి నారా లోకేష్ స్పందించి తన అభిప్రాయాన్ని చెప్పారు. వెంటనే దానిని అందుకున్న హరీష్ రావు అల్లుకుపోయి.. ఏదేదో ప్రచారం చేయడం ప్రారంభించారు. చంద్రబాబు కాలేశ్వరం ప్రాజెక్టుకి కన్నం పెట్టి నీళ్లు పట్టుకు పోవాలని చూస్తున్నారని నారా లోకేష్ మాటలకు లింకు కడుతూ వ్యాఖ్యానించారు. అయితే బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబుతో రహస్య ఒప్పందం అంటూ రేవంత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తెలంగాణ సీఎం. ఇటీవల కేటీఆర్ హైదరాబాదులో మంత్రి నారా లోకేష్ ని రహస్యంగా కలిశారని ఆరోపించారు. అప్పుడు కేటీఆర్ నేను నారా లోకేష్ ను కలవలేదంటూనే.. నా తమ్ముడు లాంటి లోకేష్ ను కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. అయితే అప్పటికి ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు పేరు లేకుండా సాధ్యం కావడం లేదు. అప్పుడు చంద్రబాబును అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ది పొందారు కెసిఆర్ అండ్ కో. ఇప్పుడు లోకేష్ పేరు చెప్పుకొని సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. అయితే తెలంగాణ ప్రజలకు ఇప్పటికే వాస్తవాలు తెలిసాయి. వారి ట్రాప్ లో పడే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment