Site icon Desha Disha

Joe Root: చివరి టెస్టులో జో రూట్ సూపర్ ఇన్నింగ్స్.. సెంచరీతో రికార్డులు బద్దలు.. – Telugu News | IND Vs ENG: Joe Root surpasses Breaks Massive Records with Century in Oval Test

Joe Root: చివరి టెస్టులో జో రూట్ సూపర్ ఇన్నింగ్స్.. సెంచరీతో రికార్డులు బద్దలు.. – Telugu News | IND Vs ENG: Joe Root surpasses Breaks Massive Records with Century in Oval Test

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఓవల్ టెస్ట్‌లో టీమిండియాపై మరో సెంచరీ చేశాడు. లార్డ్స్, మాంచెస్టర్‌లలో సెంచరీలు చేసిన రూట్ ఇప్పుడు ఓవల్ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. 137 బంతుల్లో 12 బౌండరీల సహాయంతో సెంచరీ పూర్తి చేసిన రూట్, తన పేరు మీద అనేక రికార్డులను కూడా సృష్టించాడు. దీనితో పాటు రూట్ హ్యారీ బ్రూక్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ సెంచరీ జో రూట్ తన టెస్ట్ కెరీర్‌లో 39వ సెంచరీ. ఈ టెస్ట్ సిరీస్‌లో అతడు హ్యాట్రిక్ సెంచరీలను కూడా పూర్తి చేశాడు.

భారత్‌పై 13వ సెంచరీ

టీమిండియాపై జో రూట్‌కు ఇది13వ సెంచరీ. దీంతో,రూట్ టీమ్ ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేసిన రూట్, మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేశాడు. ఇప్పుడు ఓవల్ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రూట్ కూడా రెండవ స్థానంలో ఉన్నాడు.

WTCలో 6000 పరుగులు..

ఓవల్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడం ద్వారా జో రూట్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తన 6000 పరుగులను పూర్తి చేశాడు. తన 69వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన రూట్.. 53.27 సగటుతో 21 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు చేశాడు. దీవతో.. WTCలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు. అతను 55 టెస్ట్ మ్యాచ్‌లలో 13 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీల సహాయంతో 4278 పరుగులు చేశాడు. మూడవ స్థానంలో ఆస్ట్రేలియా మార్నస్ లాబుస్చాగ్నే ఉన్నాడు. అతను 53 టెస్ట్ మ్యాచ్‌లలో 11 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీల సహాయంతో 4225 పరుగులు చేశాడు.

శతకాల జాబితాలో 4వ స్థానం

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో జో రూట్ నాల్గవ స్థానానికి చేరుకున్నాడు. రూట్ తన టెస్ట్ కెరీర్‌లో 158 మ్యాచ్‌ల్లో 288 ఇన్నింగ్స్‌లలో 39 సెంచరీలు చేశాడు. దీంతో అతను శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కరను అధిగమించాడు. సంగక్కర టెస్ట్ క్రికెట్‌లో 38 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో 51 సెంచరీలతో లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ జాక్వెస్ కల్లిస్ టెస్ట్ క్రికెట్‌లో 45 సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌లలో 41 సెంచరీలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మూడవ స్థానంలో ఉన్నాడు.

మరిన్ని  క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version