Chandrababu Vs Nitin Gadkari: చంద్రబాబు ( CM Chandrababu) ముందు చూపుతో వ్యవహరిస్తున్నారా? దేశంలో నాయకత్వం మార్పు ఉంటుందని భావిస్తున్నారా? అందుకే స్నేహితుడితో మరింత సాన్నిహిత్యం పెంచుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిజెపి నుంచి కొత్త ప్రధాని వస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో పక్కకు తప్పుకుంటారు అన్న వార్తలు వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ అదే కోరుకుంటుందని.. తప్పనిసరిగా ఆయన తప్పుకోవాల్సి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలో ప్రధాని పదవి ఎవరు చేపడతారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే బిజెపిలో చాలామంది సీనియర్లు ఉన్నారు కానీ.. ఆ పదవికి దగ్గరగా నితిన్ గడ్కరి, రాజ్ నాథ్ సింగ్ ఉన్నారన్నది బిజెపి నుంచి వినిపిస్తున్న మాట.
పరస్పర ప్రశంసలు..
తాజాగా ఏపీలో పర్యటించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి( Nitin Gadkari). గుంటూరు జిల్లా మంగళగిరిలో అతిపెద్ద వేడుక నిర్వహించారు. ఏపీలో ఏకంగా రూ.5233 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారులకు కేంద్రమంత్రి ఘట్కరి శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పురందేశ్వరి, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబుపై గడ్కరి ప్రశంసలు కురిపించారు. దేశంలోనే చంద్రబాబు లాంటి అరుదైన నాయకులు ఉంటారని కొనియాడారు. విజినరీ ఉన్న నాయకుడు చంద్రబాబు అని.. ఆయన సారధ్యంలో ఏపీ అభివృద్ధి పరంగా దూసుకెళ్తుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో చంద్రబాబు సైతం నితిన్ గడ్కరిని ప్రశంసించారు. కేంద్రమంత్రిగా ఏపీ అభివృద్ధిలో గట్కరి పాత్ర ఉందని గుర్తు చేశారు.
చాలా ఏళ్ల అనుబంధం..
అయితే గడ్కరీ తో చంద్రబాబుకు ఉన్న బంధం ఈనాటిది కాదు. రాజ్నాథ్ సింగ్ తో పాటు గడ్కరితో మంచి అనుబంధమే ఉంది చంద్రబాబుకు. గతంలో బిజెపి( BJP) నాయకత్వంతో చంద్రబాబు విభేదించినప్పుడు.. గడ్కరి చంద్రబాబుతో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబు ఎన్డీఏ ను వీడినప్పుడు కూడా ఆయన సముదాయించినట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు విముఖత చూపిందని ప్రచారం నడిచింది. అయితే ఆ సమయంలో కూడా నితిన్ గడ్కరి పొత్తుకు చొరవ చూపినట్లు కూడా తెలుస్తోంది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు నితిన్ గడ్కరి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎనలేని సాయం చేసిన విషయాన్ని సైతం చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. అయితే పదే పదే రాష్ట్ర అభివృద్ధికి గడ్కరి అవసరం ఉందని నొక్కి చెప్పడం కొత్త ప్రచారానికి తెర తీస్తోంది.
మోడీ వారసుడిగా..
మరి కొద్ది నెలల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) 75 వసంతాలు పూర్తిచేసుకున్నారు. అయితే 75 సంవత్సరాలు దాటిన వారు బిజెపిలో పదవులు చేపట్టకూడదన్న నిబంధనను తెరపైకి తెచ్చింది ఆర్ఎస్ఎస్. ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక ప్రకటన చేశారు. 75 సంవత్సరాలు దాటిన వారు తప్పకుండా పదవులు వదులుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ లెక్కన ప్రధాని మోదీ తన పదవిని వదులుకుంటే మాత్రం.. ఆ స్థానాన్ని అధిరోహించేది నితిన్ గడ్కరీ అని బిజెపి వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ ఉద్దేశంతోనే చంద్రబాబు గడ్కరితో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.