AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం..డెన్ లో నోట్లకట్టలు.. వీడియో వైరల్!

AP Liquor Scam: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తవ్వే కొద్ది ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసిపి హయాంలో దాదాపు 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఇది స్పష్టమైంది. చార్జ్ షీట్ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది సిట్. దాదాపు 40 మంది వరకు నిందితులు ఉండగా.. ఇప్పటివరకు 12 మంది అరెస్టు అయ్యారు. త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అయితే నిన్నటికి నిన్న నిందితుల్లో ఒకరి ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వైసిపి పెద్దల ప్రమేయాన్ని నిర్ధారిస్తూ మరో ఆధారం బయటపడింది. ఈ కేసులో నిందితుల్లో ఒకడైన సిహెచ్ వెంకటేష్ నాయుడు ఓ డెన్ లో కోట్ల రూపాయలకు సంబంధించి నోట్ల కట్టలను లెక్కిస్తున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

చెవిరెడ్డికి సన్నిహితుడు..
ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Bhaskar Reddy) . ఆయన సన్నిహితుడే వెంకటేష్ నాయుడు. ప్రధాన అనుచరుడుగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో ఆయన దగ్గరగా అరిచారు. మద్యం సొమ్మును తాను ముట్టుకోలేదని.. కుట్ర చేసి కేసుల్లో ఇరికించారని.. ఇంతకు ఇంత అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు. అయితే ఇప్పుడు ఆయన ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న వెంకటేష్ నాయుడు భారీ డెన్ లో నగదు లెక్కిస్తున్న వీడియోలు బయటపడడం విశేషం. గతంలో చాలా సందర్భాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డితో వెంకటేష్ నాయుడు కలిసి ఉన్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.

కళ్ళు బైర్లు కమ్మేలా సొమ్ము..
అయితే ఇప్పుడు తాజాగా బయటపడిన వీడియోలో కళ్ళు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. ఓ గదిలో నల్లటి టీ పాయ్ పై నిలువుగా, అడ్డంగా ఆరేడు వరుసల్లో రూ.500, రూ.100 నోట్లు కట్టలు కట్టి ఉన్నాయి. వాటిని వెంకటేష్ నాయుడు( Venkatesh Naidu) లెక్కిస్తున్నారు. కొన్ని కట్టలను చూపిస్తూ ఎక్కడి వరకు నాలుగు అని చెబుతుంటారు. మరికొన్ని నోట్ల కట్టలను చూపించి ఐదు అని వివరిస్తున్నారు. ఆయన అలా లెక్క చెబుతుంటే మరో వ్యక్తి ఆ నోట్ల కట్టలను అట్టపెట్టెల్లో నింపుతున్నారు. అక్కడున్న నోట్ల కట్టలు, వెంకటేష్ నాయుడు చెప్పిన మాటలను బట్టి చూస్తే ఆ మొత్తం ఐదు కోట్లని అర్థమవుతోంది. అయితే ఈ వీడియో 2021 నాటిదని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అనుమానిస్తున్నారు.

జగన్ తో సైతం సన్నిహితం..
వెంకటేష్ నాయుడు హైదరాబాదులో( Hyderabad) రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. మద్యం ముడుపుల సొమ్మును భద్రపరచడం, అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేరవేయడం వెంకటేష్ నాయుడు ప్రధాన విధి అని సిట్ దర్యాప్తులో తేలింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు వెంకటేష్ నాయుడు కూడా జూన్ 18న అరెస్టయ్యారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితులతో తరచూ వెంకటేష్ నాయుడు సమావేశం అయ్యేవారు. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డితో సైతం టచ్ లో ఉండేవారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది. 2022 జనవరి 15న తాడేపల్లి ప్యాలెస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సెట్ ను వెంకటేష్ నాయుడు దగ్గరుండి వేయించినట్లు సిట్ గుర్తించింది. అప్పట్లో ఈ వేడుకల్లో జగన్ కు అత్యంత సన్నిహితులే పాల్గొన్నారు. ఆ వేడుకల్లో సైతం వెంకటేష్ నాయుడు కనిపించారు. జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు మద్యం కుంభకోణం అనేది జరగలేదని వైసీపీ నేతలు తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో మాత్రం ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Leave a Comment