11న సోంపేట భూముల సందర్శన
మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూని
మోడీకి ప్రతిపక్ష నాయకుడిగా ట్రంప్
స్మార్ట్ మీటర్ల పై దేశవ్యాప్త ఆందోళన
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ
సంవత్సరానికి మూడు పంటలు పండుతున్న భూములను అప్పనంగా బడా బాబులకు అప్పగించాలని చూస్తే ఊరుకునేది లేదని సమరశీల పోరాటాలకు సిద్ధపడుతామని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ హెచ్చరించారు. తిరుపతి జిల్లా సిపిఐ ద్వితీయ మహాసభలు సూళ్లూరుపేటలో ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కార్యదర్శి పి మురళి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కె నారాయణ మాట్లాడుతూ సోంపేట భూములను రాష్ట్ర ప్రభుత్వం బడాబాబుల అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని,ఈనెల 11వ తేదీ తానే స్వయంగా ఆ భూములను సందర్శించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని ఆయన పెర్కొన్నారు. గతంలో సోంపేట భూములను ప్రైవేటు వ్యక్తులకు దారా దత్తం చేసేందుకు పూనుకోగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పోరాటం సాగించామని చెప్పారు. ఈ ఆందోళనలో ముగ్గురు అశువులు బాసిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు తిరిగి ఆ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని గతంలో రైతుల జోలికి వెళ్ళిన చంద్రబాబుకు ఏ గతి పట్టిందో ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కరేడు భూములను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్లడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూని అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు మోడీ కను సన్నల్లో నడుస్తున్నాయని దీంతో దేశం పెను ప్రమాదంలో పడబోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం మోడీ చెప్పు చేతుల్లో పనిచేస్తుందని అన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల కంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారారని ఎద్దేవా చేశారు. ట్రంప్ ఆదేశాలతో మోడీ తన విధానాలను అమలుపరుస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయాలతో భారతదేశ అభివృద్ధి వెనక్కు నెట్టబడుతోందని, ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తోందని చెప్పారు. ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలోనే తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయని ఆయన ఆదేశాలతో ఆయన బాటలో నడుస్తున్న మోడీకి పతనం కూడా ఖాయమని అన్నారు. ఆదాని స్మార్ట్ మీటర్ల వల్ల దేశవ్యాప్తంగా కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగి ప్రజానీకం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాటిని పగలగొట్టాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ ప్రజానీకానికి అండగా నిలబడి మరో విద్యుత్ పోరాటానికి నాంది పలుకుతామని పేర్కొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు శాఖ నుండి జాతీయ స్థాయి వరకు జరుగుతున్నాయని, ఈ మహాసభలలో దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు పోరాటానికి రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. బహిరంగ సభ ముందు జి ఎన్ టి రోడ్డు నుండి బజారు వీధి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎ రామానాయుడు, శివారెడ్డి, జయలక్ష్మి, సీనియర్ నాయకులు తులసేంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, సుధాకర్ రెడ్డి, పార్థ సారధి, చిన్నిరాజ్, గురవయ్య, ప్రభాకర్, ప్రభాకర్, విశ్వనాథ్, బాలకృష్ణ, శశి కుమార్, బండి చలపతి, కత్తి రవి, నాగేంద్ర, ఆనంద్ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య బృందం ఆలపించిన ఉద్యమ గేయాలు కార్యకర్తలను ఆకట్టుకున్నాయి.సోంపేట భూములు బడా బాబులకు అప్పగిస్తే మరో పోరాటం