Site icon Desha Disha

Oval Test : ఓవల్ స్టేడియంలో విజయ్ మాల్యా, లలిత్ మోదీ.. మధ్యలో క్రిస్ గేల్..సరిపోయారు ముగ్గురికి ముగ్గురు – Telugu News | Fugitive Billionaires Lalit Modi and Vijay Mallya Spotted at Oval Test with Chris Gayle!

Oval Test : ఓవల్ స్టేడియంలో విజయ్ మాల్యా, లలిత్ మోదీ.. మధ్యలో క్రిస్ గేల్..సరిపోయారు ముగ్గురికి ముగ్గురు – Telugu News | Fugitive Billionaires Lalit Modi and Vijay Mallya Spotted at Oval Test with Chris Gayle!

Oval Test : బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి దేశం నుంచి పారిపోయిన విజయ్ మాల్యా, లలిత్ మోదీ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల లండన్‌లో జరిగిన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో వీరు కలిసి కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఓవల్‌ స్టేడియంలో వీరు సందడి చేస్తున్న ఫొటోలను లలిత్ మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. వీరితోపాటు వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ కూడా ఉండటం విశేషం.

ప్రస్తుతం లండన్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ చివరి టెస్ట్ మ్యాచ్‌ను చూసేందుకు లలిత్ మోదీ, విజయ్ మాల్యా కలిసి ఓవల్ స్టేడియానికి వెళ్లారు. అక్కడ వీరు స్నేహితులతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించారు. ఈ సందర్భంగా లలిత్ మోదీ తన స్నేహితురాలు రీమా బౌరీ, విజయ్ మాల్యా, ఇతర మిత్రులతో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

ఈ ఫొటోలలో వీరితో పాటు, వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ కూడా కనిపించాడు. గేల్ గతంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన విషయం తెలిసిందే. అలాగే, మాజీ భారత క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా లలిత్ మోదీ పోస్ట్ చేశారు. “స్నేహితులు విజయ్ మాల్యా, రీమా బౌరీ, ఇతరులతో కలిసి ఓవల్‌లో క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను” అని లలిత్ మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఐపీఎల్ వ్యవస్థాపకుడిగా పేరు పొందిన లలిత్ మోదీ, ఆర్థిక అవకతవకల ఆరోపణలతో 2010లో దేశం విడిచి పారిపోయారు. ఇక విజయ్ మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్, యునైటెడ్ బ్రూవరీస్ మాజీ ఛైర్మన్. సుమారు 9,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసి, 2016 నుంచి బ్రిటన్‌లో తలదాచుకుంటున్నారు. మాల్యాను భారత్‌కు రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇటీవల మాల్యా కర్ణాటక హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలు చేశాయని, అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని ఆయన కోరారు.

కొన్ని వారాల క్రితం లలిత్ మోదీ తన లండన్ నివాసంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో విజయ్ మాల్యాతో కలిసి ఫ్రాంక్ సినాట్రా పాట మై వే పాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పార్టీలో కూడా క్రిస్ గేల్ పాల్గొన్నాడు. వీరిద్దరూ తరచూ పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌లలో కలిసి కనిపించడం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version