AP Welfare Schemes 2025: వైసీపీకి షాక్..ఆ రెండు పథకాలతో ప్రజల్లో సంతృప్తి!

AP Welfare Schemes 2025: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోంది. అయితే గత ఏడాదిలో పాలనను గాడిలో పెట్టింది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ.. అమరావతి రాజధానిని పట్టాలెక్కిస్తూ కొంత విజయం సాధించింది. అయితే తొలి ఏడాదిలో ప్రాధాన్యత క్రమంలో సంక్షేమంపై కూడా దృష్టి పెట్టింది. అయితే ప్రధాన సంక్షేమ పథకాలు అమలులో కొంత జాప్యం జరగడంతో విపక్షాలు విమర్శలు చేశాయి. కానీ ప్రజల నుంచి మాత్రం ఆ స్థాయిలో అసంతృప్తి లేదు. వేచి చూసే ధోరణి అధికంగా కనిపించింది. అయితే ప్రభుత్వం ఏడాది కాలంలో నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది. నిధులు కొలిక్కి రావడంతో.. సంక్షేమ పథకాల అమలు ప్రారంభించింది ఏపీ సర్కార్. అయితే ప్రధాన పక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సంక్షేమ పథకాల విషయంలోనే ఎక్కువగా మాట్లాడేది. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభం కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకరకమైన కలవరం రేగుతోంది.

 పిల్లలందరికీ చదువుకు సాయం..

 వైసీపీ హయాంలో అమ్మ ఒడి( Ammavody) పథకాన్ని అమలు చేశారు. తాను అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థి చదువుకు 15000 రూపాయల చొప్పున సాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే అమ్మ ఒడి సాయాన్ని పరిమితం చేశారు. అయితే చంద్రబాబు మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి నగదు అందిస్తామని చెప్పారు. ఆ హామీ మాదిరిగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేశారు. గత ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే ఆ విద్యా సంవత్సరంలో నిధులు జమ చేయకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేసేసరికి.. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే రెట్టింపు సాయం అందింది. దీంతో ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోంది.

 రైతుకు రెట్టింపు భరోసా..

 గతంలో రైతు భరోసా( rythu Bharosa ) పేరిట రైతులకు సాయం అందించారు. సాగుకుగాను ఆర్థిక ప్రోత్సాహం కింద రూ.7500 మాత్రమే అందించింది వైసీపీ ప్రభుత్వం. అధికారంలోకి వస్తే ఏటా రైతు సాగుకు గాను పదిహేను వేల రూపాయల చొప్పున నగదు సాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో సగానికి పరిమితం అయ్యారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏకంగా 14 వేల రూపాయలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో కలిపి సాగు సాయం కింద 20 వేల రూపాయలు ప్రతి రైతుకు అందనుంది. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం కల్పితే కేవలం రూ.13500 అందేది. ఇప్పుడు మాత్రం రూ.6,500 అదనంగా అందం ఉంది. దీనిపై రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో కూడా సంతృప్తి కనిపిస్తోంది.

 దాదాపు హామీలన్నీ అమలు..

 కూటమి ఇచ్చిన దాదాపు హామీలన్నీ అమలవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తం పెంచుతామని హామీ ఇచ్చారు. దానిని అమలు చేసి చూపించారు. అన్న క్యాంటీన్లను( Anna canteens ) తెరిచారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ ఏడాది కీలకమైన తల్లికి వందనం తో పాటు అన్నదాత సుఖీభవ అమలు చేశారు. అయితే ఇప్పుడు ప్రజల్లో సంతృప్తి కనిపిస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ప్రజల మధ్యకు ఏ అంశం మీద వెళ్లాలా అంటూ ఆ పార్టీ ఆలోచన చేస్తోంది. ఇన్ని రోజులు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెప్పామని.. ఇప్పుడు ఎలాంటి విమర్శలు చేయాలో తెలియక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తట పటాయిస్తున్నారు.

Leave a Comment