
Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో గత వారంరోజుల క్రితం వరకు వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ సహా అన్నిజిల్లాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో నాలుగైదు రోజులు ఎడతెరిపి లేకుండా వానలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరుచేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా రహదారులపైకి వర్షపు నీరు చేరి రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వర్షాలు తెరిపినివ్వడంతో ప్రజలు, రైతులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, మళ్లీ వర్షాలు దంచికొట్టబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతోపాటు ఆగస్టు 2నాటికి అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది కూడా బలపడితే ఆగస్టు 5 తరువాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వచ్చే నాలుగైదు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.