YSRCP Leader Joins BJP: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకవైపు మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరిట బల ప్రదర్శనకు దిగుతున్నారు. అయితే అరెస్టు భయంతోనే జగన్మోహన్ రెడ్డి అలా చేస్తున్నారని కూటమి చెపుతోంది. అయితే ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో అయితే ఉంది. పార్టీలో ఉన్న చాలామంది సీనియర్లు సైలెంట్ అయ్యారు. అవకాశం ఉన్నవారు కూటమి పార్టీల్లో చేరారు. ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీల్లో చేరారు. ఇప్పుడు మరో నేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భవిష్యత్తును అంచనా వేసుకుని సదరు నేత బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: పెద్ది’రెడ్డి’ ప్లాన్ వర్కౌట్ కాలే!
ఆ స్థానం కోసమే..
చాలామంది బిజెపి( Bhartiya Janata Party) నేతలు ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే కేంద్రమంత్రిగా వ్యవహరించిన సుజనా చౌదరి లాంటి నేతలు.. ఈసారి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. కేవలం రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కుతుందని భావించి ఎమ్మెల్యే పదవివైపు వచ్చారు. అయితే సమీకరణల దృష్ట్యా ఆయనకు అవకాశం దక్కలేదు. ఇటువంటి తరుణంలో కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిపోతే మేలన్న నిర్ణయానికి వచ్చారు. రాజ్యసభకు నామినేటెడ్ అయి కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు ఆయన ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే జరిగితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో బిజెపికి సరైన నాయకత్వం అవసరం. ప్రస్తుతం బిజెపి గెలిచిన 8 అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ నిలబెట్టుకోవాలని చూస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే పొత్తులో భాగంగా మరికొన్ని సీట్లు అడిగే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకునే పనిలో పడింది బిజెపి.
Also Read: చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్ బాధితులు!
పిఆర్పి ద్వారా ఎంట్రీ..
అయితే గత కొంతకాలంగా విజయవాడ( Vijayawada) నగరానికి చెందిన మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ మారుతారని ప్రచారం నడుస్తోంది. ఆయన గతంలో బిజెపిలో పని చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు అత్యంత సన్నిహితుడు కూడా. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వెల్లంపల్లి. ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే 2014 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో.. దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికల్లో శ్రీనివాసరావును తన సొంత నియోజకవర్గాన్ని కాదని.. పక్క నియోజకవర్గానికి పంపించారు. అయినా వెల్లంపల్లి ఓడిపోవాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి తప్పుకుంటారు అన్న ప్రచారం ఉంది. అదే సమయంలో పివిఎన్ మాధవ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమీకరణల రీత్యా.. వెల్లంపల్లి శ్రీనివాస్ బిజెపిలోకి వస్తారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.