Vijaya Sai Reddy Bheemili Case: విజయసాయిరెడ్డికి( Vijaya Sai Reddy ) గట్టి షాక్ తగిలింది. విజయ సాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డికి రూ.17.50 కోట్లు జరిమానా విధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నియామకం అయిన కమిటీ ఈ మేరకు సిఫారసు చేసింది. భీమిలి బీచ్ లో అక్రమ నిర్మాణాలకు గాను హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసులు మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆ కమిటీ అధ్యయనం చేసింది. బీచ్ లో అక్రమ నిర్మాణాలకు గాను రోజుకు లక్ష ఇరవై వేల రూపాయల చొప్పున.. 1455 రోజుల పాటు పనులు జరిపినందున జరిమానా వసూలు చెయ్యాలని సిఫారసు చేసింది. మూడు నెలల్లో ఆ నిర్మాణాలను తొలగించకుంటే జరిమానాలను రెట్టింపు చేస్తామని కూడా స్పష్టం చేసింది.
Also Read: అసెంబ్లీకి జగన్.. తెర వెనుక భారీ వ్యూహం!
విలువైన భూములు అలా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో ఉత్తరాంధ్రకు సమన్వయకర్తగా ఉండేవారు విజయసాయిరెడ్డి. పూర్తిగా విశాఖను తన అదుపులో పెట్టుకున్నారన్న కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. వైసిపి హయాంలోనే విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, కుమార్తె నేహా రెడ్డి భాగస్వామ్యంగా ఉన్న అవ్యాన్ రియల్టర్స్ బీచ్ రోడ్ లో విలువైన స్థలాలను కొనుగోలు చేసింది. మొదట కొందరు బినామీల పేరుతో స్థలాలు కొనుగోలు చేసి.. ఆ తరువాత అవ్యాన్ రియల్టర్స్ పేరు పైకి బదలాయించుకున్నారు. అయితే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలో ఉన్న ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు దర్జాగా చేపట్టారు. రౌడీ మూకలను పెట్టి ఇసుక తిన్నెలు ధ్వంసం చేసి.. గ్రావెల్ తో పూడ్చి కాంక్రీట్ తో నిర్మాణాలు చేపట్టారు.
మూర్తి యాదవ్ పోరాటం..
ఆది నుంచి ఈ నిర్మాణాలపై పోరాటం చేస్తున్నారు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్( Murti Yadav). అప్పట్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో కోర్టు ఆదేశాలు సైతం పట్టించుకునేవారు లేకపోయారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. ఈ ఏడాది మార్చిలోనే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు అధిక్రమించి చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి.. ఖర్చును విజయసాయిరెడ్డి కుమార్తె కంపెనీ నుంచి రాబట్టాలని.. ఎంత మొత్తం జరిమానా విధించాలో అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పుడు ఏకంగా రూ.17.50 కోట్ల జరిమానా విధించింది. బీచ్ లో అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే రెట్టింపు వసూలు చేయాలని కూడా సంబంధిత కమిటీ సిఫారసు చేసింది.
Also Read: చంద్రబాబు సింగపూర్ టూర్ పై పెద్దిరెడ్డి ‘పెద్ద’ కుట్ర?
రాజకీయాలకు దూరంగా..
ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీలో లేరు. అయితే తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు మద్యం కుంభకోణంలో ఆయన నిందితుడిగా కూడా ఉన్నారు. కానీ ఎటువంటి అరెస్టులు జరగలేదు. అయితే ఇప్పుడు కుమార్తె కంపెనీ విషయంలో నేరుగా కోర్టు కలుగజేసుకోవడం.. కమిటీ జరిమానాలకు సిఫార్సు చేయడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిపై విజయసాయిరెడ్డి తో పాటు ఆయన కుమార్తె ఎలా ముందుకెళ్తారో చూడాలి.