TDP Chittoor Strategy: నారా కుటుంబం( Nara family ) నుంచి మరో రాజకీయ వారసుడు రానున్నాడా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాడా? అందుకు తగ్గట్టు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఇప్పుడు పట్టు సాధించడం చంద్రబాబు ముందు ఉన్న కర్తవ్యం. ఇప్పటికే అక్కడ ప్రత్యర్థులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి నేతలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా కనిపిస్తోంది. అందుకే అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా టిడిపి యువనాయకత్వాన్ని తయారు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా తన తమ్ముడు కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ ను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: అజ్ఞాతంలోకి అనిల్ కుమార్ యాదవ్!
చిత్తూరు పై పట్టు సాధించాలని..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ చిత్తూరు జిల్లాను తన అదుపులోకి తీసుకుంది. 2014లో చంద్రబాబు సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. కానీ చిత్తూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాంతరంగా రాజకీయాలు నడిపింది. 2019 ఎన్నికల్లో అయితే వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. కుప్పం నియోజకవర్గాన్ని తప్పించి అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని బలహీనం చేసేందుకు ప్రయత్నించింది. చివరకు కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు కూడా శతవిధాలా ప్రయత్నించింది. వీటన్నింటినీ గుణపాఠాలుగా మార్చుకున్నారు చంద్రబాబు. అందుకే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నారు. తుడా చైర్మన్ గా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ గా యువకులను నియమించారు. అయితే వారితో పాటు తమ కుటుంబముద్ర ఉండాలంటే.. తన తమ్ముడి కుమారుడు నారా రోహిత్ ను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్తూరు జిల్లాలో ప్రచారం నడుస్తోంది.
చంద్రగిరి పై పట్టు
చంద్రబాబు ( CM Chandrababu) సొంత నియోజకవర్గం చంద్రగిరి. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో మాత్రమే చంద్రగిరి నుంచి పోటీ చేశారు చంద్రబాబు. ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె. అయితే 1994లో చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. అటు తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ నేతలు పోటీ చేస్తూ వచ్చారు. కానీ నానాటికి చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి దిగజారింది. కాంగ్రెస్, అటు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. ఇప్పుడు కూటమి ప్రభంజనంలో టిడిపి గెలిచింది. ఇదే పట్టు నిలుపుకోవాలంటే చంద్రబాబు కుటుంబ సభ్యులైతే సరిపోతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: సజ్జలను అనుమానిస్తున్న జగన్!
సినీ రంగంలో దక్కని బ్రేక్..
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు నారా రోహిత్( Nara Rohit). పెదనాన్న చంద్రబాబు, అన్న లోకేష్ ప్రోత్సాహం ఉంది. మొన్ననే నారా రోహిత్ వివాహం కూడా జరిగింది. ఆ సమయంలో పెద్దమ్మ భువనేశ్వరి అన్ని తానై వ్యవహరించారు. బాణం సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు రోహిత్. అయితే సరైన బ్రేక్ మాత్రం ఇంతవరకు రాలేదు. అందుకే రోహిత్ ను రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే చంద్రగిరి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. తెర వెనుక మంత్రాంగం జరుగుతోందని తెలుస్తోంది.