Pulivendula By-Election 2025: పులివెందులలో బిగ్ ఫైట్.. జగన్ కు కష్టమే!

Pulivendula By-Election 2025:  ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని.. ఏడాది పాలనలోనే కూటమి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దే విజయం అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దమ్ముంటే ఎన్నికలు నిర్వహించండి అంటూ సవాల్ చేస్తున్నారు. వచ్చేది మా ప్రభుత్వమేనని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జగన్ పర్యటనలకు జనం విపరీతంగా వస్తున్నారు. ఈ క్రమంలో జగన్ దూకుడు కళ్లెం వేసేందుకు టిడిపి కూటమి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అస్త్ర శాస్త్రాలతో సిద్ధం అవుతోంది టిడిపి కూటమి. జగన్మోహన్ రెడ్డి ఆయువుపట్టుపై గట్టిగానే దెబ్బతీయాలని భావిస్తోంది.

  1.   ఉప ఎన్నిక అనివార్యం.. పులివెందుల( pulivendula ) జడ్పిటిసి స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరగనుంది. అక్కడ జడ్పిటిసి గా ఉన్న తుమ్మల మహేశ్వరరెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇక్కడ పోటీ చేయాలా? వద్దా? అనే టిడిపి చాలా రకాల ఆలోచనలు చేసింది. పులివెందుల పార్టీ క్యాడర్ను కోరింది. అయితే ఇట్టి పరిస్థితుల్లో గెలిచే స్థానం ఇదని.. ఇక్కడ జడ్పిటిసి స్థానాన్ని గెలిచి జగన్మోహన్ రెడ్డికి గట్టి సవాల్ విసిరాలని టిడిపి క్యాడర్ తమ అభిప్రాయాన్ని చెప్పింది. ఇదే విషయాన్ని టిడిపి నేతలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

టిడిపి నేతల నామినేషన్. 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి( Lata Reddy ) పేరును ఖరారు చేశారు. దీంతో లతారెడ్డి తో పాటు బీటెక్ రవి తమ్ముడు జయభారత్ రెడ్డి ఈరోజు నామినేషన్ వేశారు. పులివెందుల అంటేనే వైయస్ కుటుంబ అడ్డా. అటువంటి చోట పోటీ అంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ మెజారిటీ తగ్గింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తుండడం, ఇప్పుడు ఎన్నికలు పెడితే గెలిచేది మేమే అంటూ ధీమా వ్యక్తం చేస్తుండడం.. వంటి కారణాలతో టిడిపి బరిలో దిగుతోంది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే బీటెక్ రవి దూకుడుగా ఉండేవారు. అటువంటిది అధికారపక్షం, ఆపై భవిష్యత్తు రాజకీయాన్ని నిర్దేశం చేసే ఎన్నిక కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సానుభూతి తమకు వర్కౌట్ అవుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశపడుతోంది. కానీ అధికార పార్టీగా తెలుగుదేశం సర్వశక్తులు ప్రయోగించి గెలుపును అందుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ పోరు ప్రతిష్టాత్మకంగా మారనుంది. కాగా ఈనెల 12న పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెల్లడించనున్నారు.

Leave a Comment