Pro Kabaddi League : కబడ్డీ అభిమానులకు గుడ్ న్యూస్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి ఈ మెగా టోర్నమెంట్ నాలుగు ప్రధాన నగరాల్లో కబడ్డీ ప్రియులకు అసలైన మజాను అందించబోతోంది. ఆగస్టు 29న ప్రారంభమయ్యే ఈ లీగ్‌కు వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ముఖ్యంగా, దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పీకేఎల్ తిరిగి వైజాగ్‌కు రావడం విశేషం. 12వ సీజన్ ప్రారంభ వేడుకలు వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరగనున్నాయి. ఆగస్టు 29, శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్‌తో తలపడనుంది. అదే రోజు జరిగే రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టాన్‌ను ఢీకొట్టనుంది.
ఆగస్టు 30న తెలుగు టైటాన్స్ మరోసారి బరిలోకి దిగి యూపీ యోధాస్‌తో పోటీపడనుంది. ఆ తర్వాత జరిగే మ్యాచ్‌లో యు ముంబా, గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇక సూపర్ సండే ఆగస్టు 30న, తలైవాస్, యు ముంబా మధ్య హోరాహోరీ పోరు జరగనుండగా, డిఫెండింగ్ ఛాంపియన్ హర్యానా స్టీలర్స్ తమ టైటిల్ వేటను బెంగాల్ వారియర్స్ మ్యాచ్‌తో ప్రారంభించనుంది. గతంలో వైజాగ్ 2018లో ఆరో సీజన్‌కు అంతకుముందు 1, 3 సీజన్ల పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ కబడ్డీ సందడి విశాఖ గడ్డపై నెలకొననుంది.
ఈ సందర్భంగా ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. “ప్రో కబడ్డీ లీగ్ ఎదుగుదలలో 12వ సీజన్ ఒక కొత్త అధ్యాయం. ఈ మల్టీ-సిటీ ఫార్మాట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల వద్దకు అత్యుత్తమ కబడ్డీ యాక్షన్‌ను తీసుకువెళ్తున్నాం. ముఖ్యంగా ఈ ఆటకు మంచి ఫ్యాన్ బేస్ ఉన్న విశాఖకు తిరిగి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు. 12వ సీజన్ ప్లేఆఫ్స్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AKFI) ఆధ్వర్యంలో మషల్ స్పోర్ట్స్, జియోస్టార్ కలిసి ఈ లీగ్‌ను దేశంలో అత్యంత సక్సెస్ ఫుల్ స్పోర్ట్స్ లీగ్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే, జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమ్ అవుతాయి.
మిగతా నగరాల్లో షెడ్యూల్ వివరాలు
జైపూర్: వైజాగ్ మ్యాచులు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 12 నుండి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఇక్కడ జరిగే తొలి పోరులో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్‌తో తలపడనుంది.
చెన్నై: సెప్టెంబర్ 29 నుండి చెన్నైలోని ఎస్‌డీఏటీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో మూడో లెగ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ దబాంగ్ ఢిల్లీ కేసీ.. హర్యానా స్టీలర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ రైడర్ నవీన్ కుమార్ తన మాజీ జట్టుపై పోటీపడనుండటం ఆసక్తి రేపుతోంది.
ఢిల్లీ: అక్టోబర్ 13 నుండి ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో లీగ్ చివరి దశ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లేఆఫ్స్‌కు ముందు అభిమానులకు మరింత వినోదాన్ని పంచేందుకు ఈ దశలో ట్రిపుల్ హెడర్ (రోజుకు మూడు మ్యాచ్‌లు) మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..