KL Rahul : రూ.25కోట్లు ఇవ్వడానికి రెడీగా కేకేఆర్.. ఆ జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? – Telugu News | KKR Aims for KL Rahul as Captain Is Delhi Capitals Ready to Release Him?

KL Rahul : ఇంగ్లండ్‌లో కేఎల్ రాహుల్ బ్యాట్ పరుగుల వర్షం కురిపిస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు సాధించిన రాహుల్‌పై ఒక సంచలన వార్త బయటికొచ్చింది. ఐపీఎల్ 2026లో కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ బదులు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడబోతున్నాడట. కేకేఆర్ జట్టు అతన్ని ఎలాగైనా ట్రేడ్ ద్వారా తమ స్క్వాడ్‌లోకి తీసుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్‌ను రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. అతను 13 ఇన్నింగ్స్‌లలో 539 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ కొత్త వార్త క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఇప్పుడు మంచి కెప్టెన్ అవసరం. గత సీజన్‌లో జట్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా ఉన్నాడు, కానీ టీమ్ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది, వారి ప్రదర్శన కూడా నిరాశపరిచింది. దీంతో కేకేఆర్ ఇప్పుడు భారీ మార్పులకు సిద్ధంగా ఉంది. అందుకే వారు కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకొచ్చి కెప్టెన్‌గా చేయాలని భావిస్తున్నారు. కేఎల్ రాహుల్ కోసం కేకేఆర్ ఏకంగా రూ. 25 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందట. కేఎల్ రాహుల్ కేవలం ఒక మంచి బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు, అతను కెప్టెన్, వికెట్ కీపర్ పాత్రలను కూడా సమర్థవంతంగా పోషించగలడు. అందుకే కేకేఆర్ అతని కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2025 వేలానికి ముందు కేకేఆర్ ఒక పెద్ద తప్పు చేసింది. టీమ్‌కు మూడో ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. దీని పర్యవసానంగా, అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మారాడు. అయ్యర్ వెళ్లిపోవడంతో కేకేఆర్‌కు పెద్ద నష్టం వాటిల్లింది. మొదట కెప్టెన్ మారాడు, ఆ తర్వాత టీమ్ ఆడే విధానం కూడా మారిపోయింది. గత సీజన్‌లో 14 మ్యాచ్‌లలో కేవలం 5 మ్యాచ్‌లలో మాత్రమే గెలవగలిగింది.

ఇప్పుడు ఐపీఎల్ 2026కు ముందు, కేకేఆర్ తమ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను కూడా తొలగించింది. ఒకప్పుడు ఈ జట్టు బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసిన భరత్ అరుణ్ కూడా లక్నో సూపర్ జెయింట్స్‌కు మారారు. ప్రస్తుతం కేకేఆర్ ఎలాగైనా కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకొచ్చి టీమ్ బ్యాలెన్స్‌ను సెట్ చేసుకోవాలని చూస్తోంది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్‌ను రిలీజ్ చేస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Leave a Comment