70 దేశాలపై ట్రంప్‌ సుంకాల బాంబు

సిరియాపై 41 శాతం పెంపు` పాక్‌కు రాయితీ
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకాలతో విరుచుకుపడ్డారు. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను భారీగా పెంచారు. 10 శాతం నుంచి 41 శాతం వరకు పరస్పర సుంకాలను విధించేలా ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకాలు చేశారు. భారత్‌పై 25 శాతం టారిఫ్‌ విధించారు. పాకిస్థాన్‌ దిగుమతులపై 29 శాతంగా ఉన్న టారిఫ్‌లను 19 శాతానికి తగ్గించారు. సిరియాపై అత్యధికంగా 41 శాతం సుంకం విధించారు. కెనడా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాన్ని 25 శాతం నుంచి 35 శాతానికి పెంచారు. బ్రెజిల్‌పై 10 శాతం ఉన్న సుంకాన్ని అదనంగా 40 శాతం జత చేశారు. జాబితాలో లేని దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 10 శాతం సుంకం ఉంటుందని ట్రంప్‌ వెల్లడిరచారు. పరస్పర సుంకాల నేపథ్యంలో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆగస్టు 1 వరకు ట్రంప్‌ గడువు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సుంకాలను సవరించారు. కొత్త సుంకాలు ఏడు రోజుల్లో అమల్లోకి రానున్నాయి. భారత్‌, కెనడా దిగుమతులపై సుంకాలు మాత్రం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
భారత్‌పై కోపమందుకే: మార్కో రూబియో
రష్యాతో భారత్‌ చమురు బంధమే అమెరికాను ఇబ్బంది పెట్టే అంశమని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడిరచారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తుండటం వల్లనే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మాస్కో కొనసాగించగలగుతోందని వ్యాఖ్యానించారు. ఫాక్స్‌ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కో రూబియో భారత్‌పై అసహనం వ్యక్తంచేశారు. భారత్‌కు భారీగా ఇంధనం అవసరమని, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చమురు, బొగ్గు, గ్యాస్‌ కొనగలిగే శక్తి ఆ దేశానికి ఉందని అన్నారు. రష్యాపై కొన్ని దేశాలు ఆంక్షలు విధించిన క్రమంలో ఆ దేశంలో చమురు చౌకగా లభిస్తుందని, అందుకే న్యూదిల్లీ కొనుగోలు చేస్తోందన్నారు. ఈ కొనుగోళ్లతో రష్యాకు నిధులు సమకూరుతున్నాయని, వాటితోనే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సాగిస్తోందని, ఇదే అమెరికాకు కోపం తెప్పిస్తున్న అంశమని మార్కో రూబియో వెల్లడిరచారు.

Leave a Comment